అమరావతి: రాష్ట్రంలో వారం రోజులుగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఒక్కోసారి చల్లగా, మరోసారి వేడిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ సూచనలు చేసింది. మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. వచ్చే 3 రోజుల్లో కోస్తా, సీమలో ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.
‘‘రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’’అని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆదివారం కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోయారు. కర్నూలులో 40 డిగ్రీలు, అనంతపురంలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రత నమోదయింది.