తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరొక ద్రోణి విస్తరించిందని తెలిపింది.
నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో ఈ సీజన్ చివరిసారి పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
తెలంగాణలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 2 వరకు వర్ష సూచన ఉందని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
ఏపీలో మరో రెండ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లా, యానాంలోనూ మోస్తరు వర్షం కురవనుందని తెలిపింది.