దాదాపు పదిహేనేళ్లుగా భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ముఖచిత్రంగా కొనసాగుతున్న దిగ్గజం సునీల్ ఛెత్రిని ఫిఫా గౌరవించింది. 38 ఏళ్ల ఈ భారత కెప్టెన్ ఘనతలను గుర్తించి అతని కెరీర్‌పై ప్రత్యేకంగా మూడు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ ఎపిసోడ్లు ఫిఫా స్ట్రీమింగ్ వేదిక అయిన ఫిఫా+లో అందుబాటులో ఉన్నాయి.
“రొనాల్డో, మెస్సి గురించి మీకు అంతా తెలుసు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న వ్యక్తి పూర్తి కథ ఇప్పుడు తెలుసుకోండి. సునీల్ ఛెత్రి.. అసాధారణ కెప్టెన్ సిరీస్ ఇప్పుడు ఫిఫా+లో అందుబాటులో ఉంది” అని ఫిఫా ట్వీట్ చేసింది.
ఓ ఆటగాడిగా అడుగుపెట్టి.. కెప్టెన్‌గా, నాయకుడిగా, దిగ్గజంగా ఎదిగిన ఛెత్రి ప్రయాణాన్ని ఈ వెబ్ సిరీస్ కళ్లకు కడుతుంది. మొదటి ఎపిసోడ్‌లో ఛెత్రి కెరీర్ ఎలా మొదలైంది, 20 ఏళ్ల వయసులో భారత తరపున అరంగేట్రం చేసేందుకు దారితీసిన పరిణామాలు, అతనికి ఇష్టమైనవాళ్లు, ఫుట్‌బాల్ సహచరుల గురించి ఉంటుంది.
జాతీయ జట్టు తరపున అద్భుతాలు చేయడం, అగ్రశ్రేణి విదేశీ ప్రొఫెషనల్ క్లబ్‌లో ఆడాలనే తన కల గురించి రెండో ఎపిసోడ్ వివరిస్తుంది. తన ఫ్రొఫెషనల్ కెరీర్ కోసం అతను జెనిత్ చేరుకోవడం, గెలిచిన ట్రోఫీలు, బద్దలు కొట్టిన రికార్డులు తదితర విషయాలు మూడో ఎపిసోడ్‌లో చూడొచ్చు. “సునీల్ ఛెత్రి కెప్టెన్ ఫెంటాస్టిక్” డాక్యుమెంటరీ రిలీజైన సందర్భంగా ప్రధాని మోదీ సునీల్‌కు అభినందనలు తెలిపారు. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు.