సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచారని, కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఆయన హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం కట్టిందని.. అప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు.. గాడిదలు కాస్తున్నారా..? అని జగన్ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే వాడి వేడిగా కొనసాగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు పరస్పరం ఆరోపణలు, విమర్శలతో సభలో వేడి పెంచారు. తొలి రోజు సమావేశాల్లో రాష్ట్రంలో నెలకొన్న కరువుతోపాటు ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, చంద్రబాబులు ఆయా అంశాలపై ఘాటుగా చర్చించారు.
సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచారని, కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఆయన హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం కట్టిందని.. అప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు.. గాడిదలు కాస్తున్నారా..? అని జగన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గొడవ చెలరేగింది. తమ నాయకున్ని గాడిదతో పోలుస్తారా.. అంటూ టీడీపీ నేతలు సభలో గందరగోళం సృష్టించారు. జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే తాను సామెత మాత్రమే చెప్పానని జగన్ అనడంతో ఆ వివాదం సద్దుమణిగింది.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ పట్ల సానుకూలంగా ఉన్నారని.. అందుకనే ఇరు రాష్ర్టాల ప్రయోజనాల దృష్ట్యా ఆయనతో స్నేహంగా ఉంటున్నామని జగన్ తెలిపారు. ఇద్దరు సీఎంల మధ్య సఖ్యత ఉంటే మంచిదేనన్నారు. ఇక మరో సమయంలో.. జగన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇంతటి దిక్కుమాలిన ప్రతిపక్షం ఇంకొకటి ఉండదన్నారు. దీంతో సభలో కలకలం రేగింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. తన రాజకీయ అనుభవం అంత వయస్సు జగన్‌కు ఉందని, అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగకూడదని అన్నారు. అలాగే అసెంబ్లీలో తన నోటిని మూయించగలరు కానీ.. ప్రజల నోర్లను మూయించలేరని బాబు అన్నారు. దీంతో అధికార పార్టీ కూడా బలంగానే ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఓ దశలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడగా.. సభ రేపటికి వాయిదా పడింది.