గజినీ మహమ్మద్ గురించి, అతని దండయాత్రల గురించి మనం అంతా చిన్నప్పుడే ఎంతో కొంత తెలుసుకుని ఉన్నాం. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ దండెత్తాడు. అక్బర్ 52 సార్లు విఫలయత్నం చేశాడు. అతని కుమారుడు జహంగీర్ 14 నెలలపాటు యుద్ధం చేసి చివరకు విజయం సాధించాడు. అదే కాంగ్‌రా కోట(Kangra Fort). వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను తన గర్భంలో దాచుకున్న ఈ కోటను కొల్లగొట్టడానికి అప్పట్లో ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు.. అందినకాడికి దోచుకెళ్లారు. అయినా పూర్తి స్థాయిలో ఎవరూ.. దక్కించుకోలేకపోయారు.
మన దేశంలో చారిత్రక కట్టడాలు అప్పటి రాజుల తెలివితేటలకు నిదర్శనాలు. ఒక్కోటి ఒక్కో అద్భుతం, దేనికి అదే ప్రత్యేకం.. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్‌డా సమీపంలో ఉన్న ఈ కోట అందులో ఒకటి. 465 ఎకరాల విస్తీర్ణంలో, ప్రకృతి సోయగాల నడుమ, 11 ప్రధాన ద్వారాలతో వైభోవోపేతంగా నిర్మించారు. భీకర దాడులకు ఎదురొడ్డి, భూకంపాలను సైతం తట్టుకుని నిలిచిన ఈ కోట ఇప్పటికీ ఎన్నో రహస్యాలను తనలో
దాచుకుంది. లోపల మొత్తం 21 బావుల నిండా లెక్కలేనంత సంపద ఉండేదని.. కాలక్రమంలో కొందరు వాటిని దోచుకోగా ఇప్పటికీ 8 బంగారు బావులు ఉన్నాయని వేల ఏళ్ల నుంచి కోట చరిత్ర చెప్తోంది.
కాంగ్‌రా కోటపై ఎన్నో గాథలు నేటికి ప్రచారంలో ఉన్నాయి. కటోచ్ రాజ్యానికి చెందిన సుశర్మ చంద్ర 3,500 ఏళ్ల క్రితం ఈ కోటను నిర్మించాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచి పోరాడాడు. అనంతరం తన సేనలతో ఈ ప్రాంతానికి వచ్చాడు. శత్రువుల దాడుల నుంచి తన రాజ్యన్ని కాపాడుకునేందుకు హిమాలయాలకు సమీపంలో భారీ సామ్రాజ్యాన్ని ఆయన నెలకొల్పాడు. అయితే ఎవరైనా లోపలికి ప్రవేశించాలని చూస్తే అక్కడున్న ద్వారపాలకులు నిర్ధాక్షిణ్యంగా వారి తల మొండెం వేరు చేసేసేవారట… అందుకు కారణం కోటలోని అమూల్యమైన సంపదేనని స్థానికులు భావించేవారు.
ఇంతకీ బంగారు బావులు ఏమైనట్లు..
అప్పట్లో పాలకులు భారీగా బంగారాన్ని దేవతలకు సమర్పించుకునేవారు. కోటలోని ఆలయాలకు నిత్యం విలువైన బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలు గుట్టలుగా వచ్చేవి.. కొంత కాలానికి లెక్కించడానికి సాధ్యం కానంత సంపద పోగుపడింది. దీనంతటినీ కోటలో ఉన్న 21 బావుల్లో నిక్షిప్తం చేశారు. మహమ్మద్ గజనీ 8 బావులను, బ్రిటీషు వారు 5 బావులను దోచుకొని వెళ్లారు. అలా ఈ బంగారు బావుల సంపద కోసం కాంగ్‌రా కోట ఎన్నో దాడులను తట్టుకుంది. కానీ ఇప్పటికీ ఆ మిగిలిన 8 బంగారు బావుల జాడ రహస్యంగానే మిగిలింది. బావులు ఒక్క చోట కాకుండా కోటలోని వివిధ ప్రాంతాల్లో తవ్వించి అందులో నిధులను నిక్షిప్తం చేశారు. దీంతో మిగిలిన ఎనిమిది బావులు ఎక్కడ ఉన్నాయి అనేది.. అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ బావుల్లో సంపద ఉంటుందంటారా..?