పల్నాడు పులిగా పేరు తెచ్చుకుని రాజకీయాల్లోనూ పేదలకు సేవ చేయడంలోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కోడెల శివప్రసాద్ రావు హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన లేని లోటు నిజానికి గుంటూరు రాజకీయా్లలోనూ, పల్నాడు ప్రాంతానికి కూడా ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో కోడెల వారసుడిగా అందరికీ పరిచయమైన డాక్టర్ కోడెల శివరామకృష్ణ, ఉరఫ్ శివరామ్.. ఇకపై తండ్రి లేని లోటును తీరుస్తారా? లేక తన సొంత వ్యవహారాలు, వ్యాపారాలకే పరిమితమవుతారా? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది.
విషయంలోకి వెళ్తే.. 2014కు ముందు పెద్దగా యాక్టివ్‌గా లేని శివరామ్.. తర్వాత తన తండ్రి స్పీకర్‌గా బాధ్యతలు తీసుకోవడంతో బిజీగా మారిన నేపథ్యంలో సత్తెనపల్లి సహా తమ రాజకీయ పునాదులకు కీలకమైన నరసరావుపేటలో రాజకీయ నేతగా మారారు. టీడీపీ వ్యవహారాలను దాదాపు ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. ఏదైనా సమస్య వచ్చినా కోడెల కన్నా వేగంగా శివరామ్ స్పందించే వారనేపేరు తెచ్చుకున్నారు.
ఒకపక్క వైద్య వృత్తిని కొనసాగిస్తూనే తన తండ్రి బాటలో ఈయన కూడా రాజకీయాల్లో మెలిగారు. సత్తెనపల్లిలోనూ ఆయన రాజకీయంగా కొన్ని చర్యలు చేపట్టారు. దీంతో పేదలకు ఆయన చేరువయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నుంచి టికెట్ ఆశించారు. అయితే, వివిధ రాజకీయ సమీకరణల నేపథ్యంలో శివరామ్‌కు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోడెల హఠాన్మరణం తర్వాత ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.
సత్తెనపల్లి ఇంచార్జ్ పదవిని కానీ, నరసరావుపేట ఇంచార్జ్‌గా కానీ ఆయనను నియమించే ఛాన్స్ ఉందనే ప్రచారం ఉంది. అదేసమయంలో నందమూరి తారకరామారావు కుటుంబానికి కూడా కోడెల కుటుంబం చాలా సన్నిహితంగా ఉంది. ఈ కుటుంబానికి చెందిన హైదరాబాద్లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి కోడెల ట్రస్టీగా ఉన్నారు. ఆసుపత్రి ప్రారంభంలో చైర్మన్‌గా కూడా వ్యవహరించిన కోడెల తర్వాత కాలంలో ట్రస్టీగా మారారు. ఇప్పుడు ఈ పదవిని డాక్టర్ శివరామ్‌కు అప్పగిస్తారని అంటున్నారు.
తన సోదరుడు కోడెల సత్యనారాయణ మృతి చెందిన తర్వాత ఆయన పేరుతో శివరామ్ అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకటి అరా చిన్నపాటి లోపాలు, తప్పులు జరిగినంత మాత్రాన కోడెల కుటుంబం పల్నాడు ప్రజలకు, గుంటూరు వాసులకు చేసిన మేలును మరిచిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారనేది ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి .