దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసమని ప్రజలను ఇంటికే పరిమితం చేసిన ప్రభుత్వాలు.. భౌతిక దూరంతోనే ఈ మహమ్మారిని అంతం చేయొచ్చ ని చెబుతున్నాయి. అయితే, ఈ విషయంలో కేంద్రం తాను పోషించాల్సిన పాత్ర నుంచి వెనక్కి తప్పుకొంటోందనే వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా మన దేశం.. రాష్ట్రాల కలయిక కాకపోవడంతో రాష్ట్రాలకు ప్రత్యక్ష అధికారాలు ఉన్నాయి. అదేసమయంలో ఇలాంటి సమయంలో కేంద్రానికి కూడా రాష్ట్రాలపై అధికారం ఉంటుంది. అయితే, ఈ విషయంలో కేంద్రం దూకుడు తగ్గించి.. రాష్ట్రాల అధికారాలకే వదిలి వేస్తోంది.
ఉదాహరణకు కేంద్రం తలుచుకుంటే.. కరోనా ఈ దేశంలోకి వచ్చి ఉండేది కాదనే వాదన బలంగా ఉంది. గత డిసెంబరులోనే యూరప్ దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత దేశం ముందస్తు చర్యలు తీసుకోలేదన్నది నిర్వివాదాంశం. కనీసం ఫిబ్రవరి రెండో వారంలో అయినా కేంద్రం మేల్కొన లేదు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంటూ.. ఎక్కడికక్కడ అంతర్జాతీయ విమానాలను అనుమతించారు. రాకపోకలు సాగించారు. ఎక్స్‌పోర్టు, ఇంపోర్టులకు గ్రీన్ సిగ్నల్ కొనసాగించారు. అసలు అప్పుడే విమాన ప్రయాణాలు నిలిపి వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది నిపుణుల మాట. సరే.. రెండో కోణం చూస్తే.. లాక్‌డౌన్ విషయంలోనూ రాష్ట్రాలతో సంప్రదించి చేశారు. సరే! ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే కేంద్రాన్ని తప్పు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలా చేశారని అనుకుందాం.
ఆ తర్వాత కూడా కేంద్రం తనదైన శైలిలో స్పందించలేదు. రాష్ట్రాలకే బాధ్యతలను అప్పగించింది. అయితే, అప్పటికే రాష్ట్రాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరోనా ను తట్టుకునే రేంజ్‌లో వైద్య సామగ్రిని ఉత్పత్తి చేయలేక ఆపశోపాలు పడుతున్నాయి. ఇక, ఇప్పుడు కూడా కేంద్రం రాష్ట్రాల విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోనట్టుగానే ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి లాక్‌డౌన్ పొడిగింపు విషయంలో రాష్ట్రాలు భయపడుతున్నది ఆర్థిక సమస్య విషయంలోనే. ఏపీ వంటి ఆర్ధిక సమస్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్ విషయంలో పొడిగింపును ఇష్టపడడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రమో చొరవ చూపి ఈ లాక్‌డౌన్ కారణంగా తలెత్తే నష్టం తాలూకు నిధులు మేం భర్తీ చేస్తాం.. అని కానీ, లేదా కొన్నాళ్లపాటు కేంద్ర పన్నులను వసూలు చేయబోమని కానీ ఎక్కడా హామీ ఇవ్వడం లేదు.
దీంతో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. రాష్ట్రాలకే కరోనా ముప్పు తాలూకు నష్టాన్నివదిలి పెట్టేందుకు ప్రయత్నిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇది రాష్ట్రాలకు రుచించడం లేదు. ఇకనైనా..కేంద్రం కరోనా విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలు సహా నిపుణులు కూడా చెబుతున్నారు. ఆర్ధిక నష్టాలను భరించడంతోపాటు ప్రజలకు కూడా కేంద్రం నుంచి నిధులు వస్తే.. లాక్‌డౌన్ సక్సెస్ అవుతుంది. ఫలితంగా కరోనా భూతం నుంచి దేశం బయట పడుతుందనేది నిపుణుల సూచన, మరి కేంద్రం మాత్రంనిమ్మకు నీరెత్తినట్టు వీడియో కాన్ఫరెన్సులు పెడుతూ.. చప్పట్లు, దీపాలతో పొద్దు పుచ్చుతోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికేనా కేంద్రం మేల్కొనాలని అందరూ కొరుతున్నారు.