ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే నూతన ప్రైవసీ పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దానిపై పెద్ద ఎత్తున యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం, చాలా మంది వాట్సాప్‌ను వదిలి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకు మారడంతో వాట్సాప్ ప్రైవసీ పాలసీ అమలు నిర్ణయాన్ని వాయిదా వేసింది.
తాజాగా సుప్రీం కోర్టు వాట్సాప్‌కు అక్షింతలు వేసింది. లక్షల కోట్ల రూపాయల కంపెనీ అయితే ఏంటి ? ప్రజలకు వారి ప్రైవసీ ముఖ్యం, వారికి ప్రైవసీ ఉండేలా చర్యలు తీసుకోండి.. అంటూ కోర్టు వాట్సాప్‌ను ఆదేశించింది. అయితే వాట్సాప్ మాత్రం నూతన ప్రైవసీ పాలసీని అమలు చేసేందుకే సిద్ధమైంది. ఇందుకు గాను కొత్త గడువు తేదీని కూడా వాట్సాప్ ప్రకటించింది.
వాట్సాప్ యూజర్లకు వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించేందుకు మే 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ లోగా యూజర్లు ఆ పాలసీకి తమ అనుమతిని తెలపాలి. అయితే వాట్సాప్ ఇప్పటికే తీవ్ర విమర్శల పాలు అయిన నేపథ్యంలో మళ్లీ ప్రైవసీ పాలసీని అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది. కనుక ఈ సారి దీనిపై ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి.