ఇటీవల వాట్సాప్ ప్రైవసీ పాలసీలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వినియోగదారుల ప్రైవసీ అంగీకారానికి కూడా మే 15 వరకు గడువు ఇచ్చింది. అయితే, తాజాగా వాట్సాప్ తన ప్రైవసీ పాలసీ అమలుపై మరో సారి స్పష్టమైన ప్రకటన చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక మే 15 నుంచి అమలులోకి వచ్చిన తమ కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది.
వాట్సాప్ యూజర్లు తమ నూతన విధానాన్ని అంగీకరించకపోతే వారి ఖాతాలను క్రమంగా తొలగిస్తామని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు వాట్సాప్ తరఫున కపిల్ సిబాల్ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాలని యూజర్లకు ఇప్పటికే కోరామని ఆయన కోర్టుకు తెలిపారు. ఒకవేళ వారు ప్రైవసీని ఒప్పుకోకపోతే వారి వాట్సాప్ ఖాతాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకు స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో వాయిదా వేయబోమని తెలిపారు. కేంద్రం తరఫును అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. వాట్సాప్ తీసుకువస్తున్న నూతన పాలసీ విధానం ఇన్ఫరేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయన్నారు. అయితే, ఈ అంశంపై కేంద్రం కూడా సంస్థ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. వారి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఈ విధానంతో ఐటీ నిబంధనలను ఉల్లంఘించడం లేదని వాట్సాప్ మరోమారు తెలిపింది. కానీ, కోర్టు దానికి నిరాకరించింది. విచారణను జూన్ 3కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.