బాబు – జగన్: ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడంలో ఎవరు దిట్ట?

-

తిరుమలకు వెళ్లినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. డిక్లరేషన్ పై సంతకం పెడతారా పెట్టరా అనేది పెద్ద హాట్ టాపిక్ అయ్యి కూర్చున్న సంగతి తెలిసిందే! ఈ విషయంపై రాజకీయంగా పేలాలు ఏరుకోవాలని అటు బీజేపీ, ఇటు టీడీపీ గోతికాడ కాచుకుని కూర్చున్న సంగతీ తెలిసిందే! ఈ క్రమంలో మైకందుకున్న చంద్రబాబు… ప్రజల మనోభావాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని మండిపడ్డారు.

దీంతో… అసలు ప్రజలకు కులమతాలకు అతీతంగా మనోభావాలు ఉంటాయని.. వాటితో ఆటలాడటం సరైంది కాదని.. అలాంటి పనులు చేయడం అత్యంత నీచమైన పని అని చంద్రబాబుకు ఇప్పుడే తెలిసిందా? ఈ విషయంలో జగన్ – చంద్రబాబుల్లో ఎవరు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారో, ఆడుకున్నారో ఇప్పుడు చూద్దాం!!

తాను హిందువుని అని చెప్పుకునే వ్యక్తులు… పూజలు చేస్తున్న సమయంలో బూట్లు తీయకపోయినా.. పంచె కట్టుకోకపోయినా.. ఆఖరికి ఆ తతంగాన్ని సినిమా షూటింగ్ లా మార్చేసినా.. అది హిందువుల మనోభావాలతో ఆడుకోవడంలోకి రాదా? హిందువుని అని చెప్పుకునేవారి పాలనలో రోడ్ల విస్తరణ పేరుచెప్పి విచక్షణారహితంగా దేవాలయాలు కూల్చి వేసినా.. వాటిని పునఃనిర్మించకపోయినా అది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం కాదు?

కొండమీద పనిచేసే క్షురకులు వేతనాలు పెంచండి బాబూ… బ్రతకలేకపోతున్నాం అని బ్రతిమాలితే… తోకలు కత్తిరిస్తామనడం హిందువుల మనోభావాలతో ఆడుకోవడం కాదు? దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని నిస్సిగ్గు వ్యాఖ్యలు చేయడం దళితుల మనోభావాలు కించపరిచి రాక్షసానందం పొందడంలోకి రాదు! రాయలసీమలోని రెడ్లు అంతా గుండాలే అన్న చంధంగా వ్యాఖ్యానించినా అది వారి మనోభావాలతో ఆడుకోవడంలోకి రాదు!

హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ.. అంతా పద్దతిప్రకారం వెంకన్నకు సేవచేసుకున్నా… డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే మాత్రం అది ఏకంగా… హిందువుల మనోభావాలతో ఆడుకోవడమే అయిపోతుంది. పైగా… ఈ మాటలు చంద్రబాబు నోటి నుంచి వినవలసి వచ్చింది!! నేడు మైకులముందుకువచ్చి హడావిడి చేసేసి రాజకీయ మనుగడకోసం పరితపిస్తోన్న రాజకీయ నిరుద్యోగులు… ఈ డిక్లరేషన్ ని పట్టుకుని ఈదేద్దాం అని కలలు కంటున్నారు… జనం చూస్తున్నారన్నారు..! కొండమీద వెంకన్న కూడా చూస్తున్నారు…!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news