ఏదేమైనా మాటల గారడీ చేయాలంటే మన కేసీఆర్ సారు తర్వాతే ఎవరైనా..ఆయన మాటల వింటే చాలు అసలు అన్నీ అయిపోయినట్లే ఉంటాయి. అంత గొప్పగా ప్రజలని ఆకర్షిస్తూ మాట్లాడగలరు. అసలు ఆయన మాటలు అన్నీ నిజమేనా అన్నట్లు ఉంటాయి. తాజాగా కూడా కేసీఆర్ మీడియా సమావేశం చూస్తే అదే అనిపిస్తుంది. నాన్ స్టాప్‌గా బడ్జెట్ పై మాట్లాడుతూ…బీజేపీని తెగ తిట్టారు. ఇక ఆయన తిట్లు చూస్తే..అవునా బీజేపీ వల్ల దేశం నాశనమైపోతుందా ? అనే మనకే రావొచ్చు.
అలాగే తన హయాంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి బాధలు లేవా? అన్నట్లు ఉంటుంది. అంటే తనకు మించిన తోపు లీడర్ లేరన్నట్లే కేసీఆర్ చెప్పుకున్నారు. సరే కేసీఆర్ మాటల గారడీ గురించి తెలిసినవారు…ఇవేమీ నమ్మకపోవచ్చు. కానీ తెలియని వారు మాత్రం ఆయన గారడీలో పడతారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల గురించి కూడా తనదైన శైలిలో స్పందించిన విషయం తెలిసిందే. గతంలో అంటే ముందస్తుకు వెళ్ళి సక్సెస్ అయ్యామని, ఈ సారి ముందస్తుకు వెళ్ళమని తెగేసి చెబుతున్నారు..ఇక ఈ సారి 95-105 సీట్లు గెలుస్తామని అంటున్నారు.
కేసీఆర్ చెప్పిన ఈ రెండు మాటలని నమ్మడానికి లేదనే చెప్పాలి…రాజకీయాలని డైవర్ట్ చేయడానికి, ప్రతిపక్షాలని దెబ్బకొట్టడానికి ఎన్ని ఎత్తులైన వేస్తారు. అసలు ఇప్పుడున్న పరిస్తితుల్లో టీఆర్ఎస్‌కు 95-105 సీట్లు గెలుచుకునే సత్తా ఉందా? అంటే ఏ మాత్రం లేదని మాత్రం అందరికీ తెలుసు. అసలు మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో రాదో అనే డౌట్ కూడా ఉంది.
మరి అలాంటప్పుడు కేసీఆర్ అంత కాన్ఫిడెన్స్‌గా ఎందుకు మాట్లాడారని డౌట్ రావొచ్చు…పూర్తిగా ప్రజల మైండ్‌సెట్ మార్చడానికి కేసీఆర్ వేసిన ఎత్తు ఇది అని అర్ధం చేసుకోవచ్చు. ఇక ముందస్తు విషయంలో కూడా డౌట్ పడాల్సిందే. రాజకీయంగా ఆయన ఎప్పుడు ఎలాంటి స్టెప్ వేస్తారో..ఎవరు ఊహించలేరు. మొత్తానికైతే కేసీఆర్ మాటల గారడీ నమ్మడానికి లేదనే చెప్పొచ్చు.