ప్రపంచ దేశాలను ఓమిక్రాన్ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇప్పటికే 100కు పైగా దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరింది. ఒక్క యూకేలోనే కేసుల సంఖ్య లక్షను దాటింది. అమెరికాను కూడా ఓమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ప్రస్తుతం ఇండియాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కేసులు 700 లను దాటాయి.
ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఓమిక్రాన్ పై ఆందోళన వ్యక్తం చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ హై రిస్క్ అంటూ.. వార్నింగ్ ఇచ్చింది. ఓమిక్రాన్ వేరియంట్ రిస్క్ ఇంకా తీవ్రంగానే ఉన్నట్లు WHO తెలిపింది. అంతకు ముందు వారంతో పోలిస్తే డిసెంబర్ 20 నుంచి 26 వరకు ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం కేసులు పెరిగాయని తెలిపింది. గతంలో చెప్పిన విధంగానే డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని WHO పేర్కొంది. వివిధ దేశాల్లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే.. 2-3 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని వివరించింది.