జీవీఎంసీ ఎన్నికల్లో వారసుల ఎంట్రీ..మేయర్ పీఠం ఎవరిదో

-

విశాఖ జిల్లా రాజకీయాల్లో వాళ్ళంతా ప్రముఖులు..చట్ట సభల్లో నేతలు..అలాంటి కుటుంబాల నుంచి ఇప్పుడు మున్సిపల్ రాజకీయాలు మొదలయ్యాయి. నేతల ఇళ్ళ నుంచి పురపోరులో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారనున్న విశాఖ కార్పోరేషన్ పరిపాలన పరంగా కీలకంగా మారనుండటంతో మంత్రి నుంచి విపక్ష పార్టీల నేతలవరకు అంతా తమ వారసులను రంగంలోకి దించారు.

విశాఖ జిల్లాలో వారసత్వ రాజకీయాలు అరుదుగా కనిపిస్తాయ్. ప్రస్తుతం చట్ట సభల్లో వున్న చాలా మంది ఎమ్మెల్యేలు ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగిన వారే. ఐతే, ఈసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం వారసుల ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. సుదీర్ఘ అనుభవం వున్న నేతలు సైతం పురపోరులో బంధువులను దింపి గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుటుంబాలు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 98 వార్డులు వున్నాయి. వీటిలో ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న వార్డులు మూడు. కారణం… ఒకచోట మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె పోటీ చేస్తుండగా… ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు, కోడలు బరిలో నిలిచారు. వీళ్లు ముగ్గురూ అధికార పార్టీ అభ్యర్ధులే. జీవీఎంసీ జోన్-1 పరిధిలోని ఆరవ వార్డు నుంచి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక బరిలో ఉన్నారు. కూతుర్ని గెలిపించుకోవడానికి మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ వార్డుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మేయర్ పీఠం పై కన్నేసిన నేతలు ఏ చిన్న చాన్స్ వదులుకోకుండా వ్యూహాలకు పదును పెడుతున్నారు.

జీవీఎంసీ జోన్-5 పరిధిలో 20 వార్డులు వుండగా… ఇక్కడ రెండు స్ధానాల్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి కుటుంబ సభ్యులు పోటీలో వున్నారు. 74, 75 వార్డుల నుంచి తిప్పల వంశీరెడ్డి, తిప్పల ఎమిలా జ్వాల బరిలో నిలిచారు. వీరిలో వంశీ ఎమ్మెల్యే పెద్ద కుమారుడు కాగా, మాజీ కార్పొరేటర్ ఎమిలి జ్వాల చిన్నకోడలు. ఇక, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపాల్టీపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయ్యన్న సతీమణి పద్మావతి 26వ వార్డులోనూ, 25వ వార్డు నుంచి కుమారుడు రాజేష్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నేతల వారసులు బరిలోకి దిగడంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఫలితాల వరకు… అందరిలో ఆసక్తి ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news