టీడీపీలో ఆ ప‌ద‌వి ద‌క్కేదెవ‌రికో… రేసులో ఉద్దండులు…!

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు… ఆ పార్టీలో కీల‌క పోస్టుల ఏర్పాటు దిశ‌గా అడుగులు వేశారు. రాష్ట్రంలోని ప్ర‌తి పార్ల‌మెంటు స్థానానికి పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులు, లేదా మాజీ మంత్రుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క‌మిటీ.. పార్టీని మ‌రింత‌గా ముందుకు తీసుకువెళ్లేందుకు ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఆయ‌న భావించారు. ఈ క్ర‌మంలోనే దీనిపై ఈ నెల 27న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నట్టు ఇప్ప‌టికే పార్టీ నుంచి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ పార్టీలో సీనియ‌ర్లు, మాజీ మంత్రులు ఈ ప‌ద‌వుల కోసం క్యూక‌ట్టారు. ఆశావ‌హులు కూడా పెరుగుతున్నారు.సామాజిక వ‌ర్గాల వారీగాకూడా త‌మ్ముళ్లు.. ఈ ప‌ద‌వులు త‌మ‌కే వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జిల్లాలో రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. ఏలూరు, న‌ర‌సాపురం. ఈ రెండు చోట్లా రెండు క‌మిటీలు ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్ర‌మైన ఏలూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌ది స‌స్పెన్స్‌గా మారింది.

ఈ పార్ల‌మెంటు స్థానం కృష్ణా జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో కూడా విస్త‌రించి ఉంది. జిల్లాలో మాజీ మంత్రి, ఎస్సీ వ‌ర్గానికి చెందిన‌ పీత‌ల సుజాత యాక్టివ్‌గా ఉన్నారు. ఇక‌, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన గ‌న్ని వీరాంజ‌నేయులు ఉన్నారు. బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు, ఏలూరు పార్ల‌మెంటు స్థానం కింద‌కు వ‌చ్చే నూజివీడు నుంచి ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌రావు ఉన్నారు. వీరంతా కూడా ఏలూరు పార్ల‌మెంటు క‌మిటీ చీఫ్ ప‌ద‌వి రేసులో ఆయా సామాజిక వ‌ర్గాల వారీగా రేసులో ఉన్నారు.

ఎస్సీ వ‌ర్గానికి ఈ ప‌ద‌విని ఇవ్వాల‌ను కుంటే.. పీత‌ల సుజాత సిద్ధం. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. ఆమె పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నారు. అయితే.. త‌న‌కు ఇంత పెద్ద ప‌ద‌వి ఇచ్చే కంటే.. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని ఆమె కోరుతున్నారు. ఇక‌, బీసీ వ‌ర్గానికి ఇవ్వాల‌నుకుంటే ముద్ద‌ర‌బోయిన  పేరు వినిపిస్తున్నా…. ఇప్పుడున్న ప‌రిస్థితిలో గ‌న్ని వీరాంజ‌నేయులు బెస్ట్ అనే టాక్ వినిపిస్తోంది. పైగా ఈయ‌న పార్టీలో షార్ప్ షూట‌ర్‌గా ఉన్నారు. వివాద ర‌హితుడు, అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంలో దూకుడు, టీడీపీని ముందుకు తీసుకువెళ్ల‌డంలో వ్యూహాలు.. వంటివి గ‌న్నికి ప్ల‌స్‌లుగా మారాయి. దీంతో ఏలూరు పార్ల‌మెంటు చీఫ్ పోస్టుకు ఈయ‌నైతేనే బెట‌ర‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

మెట్ట ప్రాంతంలో క‌మ్మ వ‌ర్గం డామినేష‌నే టీడీపీలో ఎక్కువుగా ఉంది. దెందులూరు, చింత‌ల‌పూడి, పోల‌వ‌రంలో క‌మ్మ‌ల హ‌వానే ఎక్కువుగా ఉంది.
పైగా.. ఈ ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలో చింత‌ల‌పూడి, పోల‌వ‌రం వంటి రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి. ఆయా చోట్ల పార్టీని మ‌రింత ప‌రుగులు పెట్టించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో గ‌న్ని అయితే.. బెస్ట్ అనే భావ‌న వినిపిస్తోంది. ఇక‌, న‌ర‌సాపురం పార్ల‌మెంటు స్థానంలో ఏర్పాటు చేయ‌బోయే క‌మిటీకి కాపు సామాజిక వ‌ర్గానికి అవ‌కాశం ఇస్తే.. బెట‌ర‌ని అంటున్నారు. స్థానికంగా క్ష‌త్రియ వ‌ర్గాన్ని పార్టీ వైపు తిప్పాలంటే.. ఆ వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇస్తే.. బెట‌ర‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

మెంటే పార్ధసారథి, వీరవాసరానికి చెందిన చంద్ర శేఖర్‌, తాడేపల్లిగూడెంకు చెందిన గొర్రెల శ్రీధర్‌, పాలకొల్లుకు చెందిన ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, భీమవరానికి చెందిన కోళ్ల నాగేశ్వరరావు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో స‌గం విస్త‌రించి ఉన్న రాజ‌మండ్రి పార్ల‌మెంటు జిల్లా అధ్య‌క్ష ప‌ద‌విని బీసీల‌కు ఇస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న ఉంది. మొత్తానికి టీడీపీ పార్ల‌మెంట‌రీ ప‌గ్గాలు ఎవ‌రికి ద‌క్కుతాయో ?  ప‌శ్చిమ‌లో తీవ్ర ఉత్కంఠ‌గా ఉంది.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news