ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి అనేక అనుమానాలు, ఎన్నో ట్విస్టులు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతపై ఆరోపణలు వస్తే ప్రతిపక్షాలు మద్దతివ్వడం, ఇంకోవైపు కోర్టు నుంచి సానుకూల తీర్పులు ఇదే మొదటిసారి కావొచ్చు. ఇదిలా ఉంటే ఈటలను తొలగించింది ఆరోగ్యశాఖ నుంచి కాబట్టి ఇక్కడ మరోసారి సెంటిమెంట్ తెరమీదకు వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ సెంటిమెంట్ అందరినీ భయపెట్టేది. అప్పుడు ఎవరు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నా వారు ఓడిపోయేవారు. ఒకవేళ ఎవరైనా గెలిచినా మంత్రి పదవి దక్కేది కాదు. దీంతో అందరూ ఆ శాఖను చేపట్టేందుకు భయపడేవారు.
ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ సెంటిమెంట్ అందరినీ కలవరపెడుతోంది. గతంలో ఆరోగ్యశాఖను చేపట్టిన రాజయ్య పలు ఆరోపణలతో త్వరలోనే బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వా లక్ష్మారెడ్డి చేపట్టినా రెండోసారి అవకాశం రాలేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ చేపట్టినా.. మూడేళ్లు కూడా గడవక ముందే పదవి పోయింది. దీంతో ఇప్పుడు ఆ శాఖను చేపట్టేందుకు అంతా వెనకడుగేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకో వైపు కేసీఆర్ ఆ శాఖను హరీశ్‌రావుకు ఇస్తారని తెలుస్తోంది. మరి అదే జరిగితే హరీశ్‌రావు పరిస్థితి కూడా అంతేనా అనే చర్చ సాగుతోంది.