కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏ ఒక్క కీలకమైన ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించలేదు. అసలు కీలకమైన ప్రాజెక్టుల ఊసు కూడా లేకుండా బడ్జెట్‌ను ముగించేసింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రవిమర్శలు గుప్పిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీకి ఏమాత్రం బాధ్యత లేదని వారు దుయ్యబడుతున్నారు.ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలు కూడా మౌనం వహించాయి. అధికార పార్టీలను కేంద్రంగా చేసుకుని విమర్శించినా.. పార్లమెంటులో ఆయా పార్టీలకు కూడా భాగస్వామ్యం ఉన్నందున తమపై కూడా విమర్శలు వస్తాయని భావించి కేవలం తూతూ మంత్రంగా కేంద్రంపై విమర్శలు చేసి ఈ విషయాన్ని పక్కన పెట్టాయి.
అయితే, ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రశ్నించడం మానేసి ఇప్పుడు బీజేపీ పంచన చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కూడా మిగిలిన ప్రతిపక్షాల మాదిరిగా మౌనంగా ఉంటే సరిపోయేది. కానీ, ఆయన రాష్ట్రాలదే వైఫల్యం అంటూ.. కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు సంధించారు. అదేసమయంలో కేంద్రంలోని మోడీని ఆకాశానికి ఎత్తేశారు. కేంద్ర బడ్జెట్ సరికొత్త భారతావనికి పునాదులు వేస్తోందని పవన్ కల్యాణ్ కొనియాడారు.
దేశాన్ని పురోగతి వైపు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికమాంద్యం ప్రభావం భారతదేశంపై ఉన్న గడ్డు పరిస్థితుల్లోనూ కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్ప ఆకాంక్షలతో కూడుకున్నదన్నారు. ఈ బడ్జెట్ బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయం, ఉత్పత్తి, నిర్మాణరంగానికి కేటాయించిన నిధులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు చాలా అవకాశాలు కల్పిస్తాయన్నారు.
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమైందని పవన్ ఆరోపించారు. కూల్చివేతలు, రద్దులు, రాజధాని తరలింపులు, ప్రత్యేర్థులను బూతులు తిట్టడంపై పెట్టిన శ్రద్ధ, బడ్జెట్‌ను తెప్పించుకునే అంశంపై పెట్టి ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా నిధులు వచ్చేవన్నారు. అయితే, పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు.
ఏమాత్రం జ్ఞానం ఉన్న నాయకుడైనా ఇలాగేనా మాట్లాడేదని తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీతో అంటగాకుతున్న నీకు.. ఏపీ ప్రజల కష్టాల విషయంలో మాత్రం బాధ్యత లేదా? అని ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఏపీ ప్రాధాన్యాలను నువ్వు కేంద్రానికి వివరించి, ఏపీ ప్రజల పక్షాన గళం వినిపించి ఉంటే బాగుండేది కదా? అని అంటున్నారు. అంతేకాదు, నీకు మేం ఓటు వేయాలి.. కానీ, మా కష్టాలు మాత్రం నీకు అవసరం లేదా? అని నిలదీస్తున్నారు. మరి ఈ జనసేనాని ఏం సమాధానం చెబుతారో చూడాలి.