భోజనాలకు వెళ్లినప్పుడు విస్తర వేయగానే అందరం కాసిన్ని నీళ్ల విస్తరపై చల్లుతారు.. విస్తర క్లీన్ చేయడానికా అంటే.. మరి అన్ని నీళ్లు పోసుకోం.. అసలు ఇలా తినేముందు విస్తర చుట్టు నీళ్లు ఎందుకు పోస్తారో మీకు తెలుసా..? చాలామంది తెలియకుండానే ఈ పద్ధతిని ఏళ్లుగా పాటిస్తున్నారు. బ్రహ్మాణులు భోజనం చేసేప్పుడు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అసలు ఇలా ఎందుకు పోస్తారో, దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఈరోజు చూసేద్దాం..! నిజానికి మనం పాటించే ప్రతి సంప్రదాయం వెనక ఒక బలమైన కారణం ఉంది.. కానీ అది తెలియకుండానే ఒక తరం తర్వాత ఒక తరం వాటిని పాటిస్తూ వచ్చేస్తున్నాం.. ఈ జనరేషన్ వాళ్లకు ఇలా చేయండి అంటే సరిపోదు.. ఇలా ఎందుకు చేయాలో మన దగ్గర సమాధానం ఉండాలి.. మీరు సమాధానం చెప్పకుంటే.. వాళ్లు ససేమీరా అంటారు.. కాబట్టి.. ఆచారాల వెనుక ఆధారాలు లేకపోయినా.. కనీసం సమాధానాలైన అన్వేషిద్దాం.!!
తినడానికి ముందు అరటి ఆకు చుట్టూ మూడుసార్లు వృత్తాకారంలో నీటిని చిలకరించడం అనేది పురాతన కాలం నుంచి వస్తుంది. ఈ అభ్యాసాన్ని మన చుట్టూ పెద్దవాళ్లు చేసేప్పుడు, సినిమాల్లోనూ కూడా చూసి ఉంటారు..ఇలా నీళ్లు(Water) విస్తరు చుట్టూ చల్లడాన్ని ‘చిత్రాహుతి’ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ పద్ధతి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రాహ్మణులలో ఇప్పటికీ ఉంది. ఈ అభ్యాసం ద్వారా ప్రజలు దేవతల నుండి దీవెనలు పొందుతారని ఓ నమ్మకం.
దేవుడికి నైవేద్యంగానా..?
తమ ఆహారం చుట్టూ నీటిని చిలకరించినప్పుడు అది దేవునికి నైవేద్యాన్ని సమర్పించడంతో సమానం.. మనకు తినేందుకు ఆహారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని సూచిస్తుందట.. కొన్ని సందర్భాల్లో భోజనం ప్రారంభించే ముందు దేవతలకు నైవేద్యంగా ఆహారంలో కొంత భాగాన్ని పక్కన పెట్టే పద్ధతి కూడా ఉంది.
ఈ లాజిక్ కూడా..
ఈ పురాతన పద్ధతి వెనక లాజిక్ కూడా ఉంది. ఇది ప్రాచీన కాలంలో ఋషుల నుంచి వచ్చిందని నమ్ముతారు. ఋషులు తమ జీవితంలో ఎక్కువ భాగం అటవీ ప్రాంతాలలో నివసించే వారు. ఒక వేళ ఆశ్రమంలో ఉన్నా.. ఇప్పటిలాగా టైల్స్ ఉండేవు కాదు…నేల మీదే కూర్చొని ఆహారం తినే వారు. అంతేకాదు అరటి ఆకుల్లో ఆహారం ఎక్కువగా వడ్డించేవారు. అయితే ఆహారం నేలకు తాకే అవకాశం ఉంది. అందుకే మట్టి లేదా దుమ్ము రేణువులు లేచి అరటి ఆకులో పడకుండా.. చుట్టూ నీటిని చల్లేవారు.
కీటకాల నుంచి దూరంగా…
కీటకాల నుంచి దూరంగా ఉండేందుకు కూడా ఇలా చల్లుతారని ఇంకొంతమంది అంటుంటారు.. ముఖ్యంగా పురాతన కాలంలో రాత్రి సమయంలో కాంతి తక్కువ. మనలాగా వారికి లైట్స్ లేవు. రాత్రి సమయంలో కాంతి తక్కువగా ఉన్నప్పుడు.. చీమలు లేదా కీటకాలు నీటిని దాటడానికి లేదా నీటిపై తొక్కడానికి ధైర్యం చేయవు.. అందుకే తినే ముందు విస్తర చుట్టు నీళ్లు చల్లి తింటారట.
మొత్తానికి ఏదో ఒక కారణంతో.. ఆ రోజుల్లో పూర్వీకులు పాటించారు. ఈరోజుల్లో విస్తర్లో తినేవాళ్లే తక్కువ.. ఇక నీళ్లు చల్లి తినేవాళ్లు మరీ తక్కువ.. అప్పట్లో పాటించే ఆచారాలను పుస్తకాల్లో, పాత సినిమాల్లో చూడటం తప్ప రియల్‌గా చూడలేని పరిస్థితి మనది..!!