ప్రధాని ఫొటో ఉండటంపై మీరెందుకు సిగ్గుపడుతున్నారు? పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్న

కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఉండటంపై మీరెందుకు సిగ్గు పడుతున్నారు? న్యాయ వ్యవస్థ సమయం వృథా చేశారంటూ పిటిషనర్‌పై కేరళ హైకోర్టు మండిపడింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ సర్టిఫకెట్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో తొలగించాలనే పిటిషన్ విచారణ అర్హతపై కేరళ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట యూనివర్సిటీలు ఉన్నాయని, అయితే, పిటిషనర్ దానిని వ్యతిరేకించ లేదని హైకోర్టు పేర్కొన్నది.

వ్యాక్సినేషన్ సర్టిఫకెట్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఉండటం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కాంగ్రెస్ కార్యకర్త పీటర్ మైలియాపరంపిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఆయన మన దేశ ప్రధాని. అంతేకానీ, మరో దేశానికి కాదు. ప్రజల ఓట్ల ద్వారా ఆయన అధికారంలోకి వచ్చారు. మీకు ఉన్న రాజకీయ విభేదాల కారణంగా, వ్యాక్సినేషన్‌పై ప్రధాన మంత్రి ఫొటో ఉండటాన్ని సవాల్ చేయలేరని పిటిషనర్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది.