సాధారణంగా మహిళలు తమ భర్తల విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటారు. భర్త మరో స్త్రీ వైపు కన్నెత్తి చూసినా కొందరు తట్టుకోలేరు. అలాంటిది తన భర్త వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి.. అతడికి ఆ యువతితో పెళ్లి చేసింది ఓ మహిళ. ఈ సంఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. టిక్‌టాక్‌లో రాణిస్తున్న అతడికి మొదట విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు. తర్వాత ఆమె నుంచి దూరమయ్యాడు.
ఆపై టిక్‌టాక్‌లోనే పరిచయమైన కడపకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి రావడంతో అతడికి పెళ్లయిన విషయం తెలిసింది. అయినా ఆమె నిరాశపడకుండా.. ఆ యువకుడి భార్యతో మాట్లాడి.. తానూ ఇక్కడే ఉంటానని, అంతా కలిసి ఉందామని చెప్పడంతో ఆమె మొదట అయోమయం చెందింది.
చివరకు ముగ్గురూ కలిసి ఉండడానికి ఒప్పుకొని తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి సిద్ధపడడంతో వారి వ్యవహారం పెళ్లిపీటలను చేరింది. తానే దగ్గరుండి భర్త ప్రియురాలిని అలంకరించి బుధవారం పెళ్లి చేసింది.