కాంగ్రెస్ లో రాజకీయం చీలిక దిశగా సాగనుందా

-

కాంగ్రెస్‌లో అసమ్మతి కాక చల్లారినట్లే చల్లారి మరోసారి అగ్గిరేపింది. జి-23 రెబల్స్ లో కొందరు జమ్ములో బలప్రదర్శన చేశారు. పార్టీ పరిస్థితిపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూనే..పార్టీ బలోపేతం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనన్నారు. హేమాహేమీలను పార్టీ నుంచి సాగనంపి ముందుకు సాగిన కురువృద్ధ పార్టీ.. ఇప్పుడు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో తెలియక జుత్తుపట్టుకుంటోంది.

పార్టీలో అసమ్మతి రాచపుండులా బాధిస్తోంది. వేటేసే సాహసం లేదు.. ఆమోదించే పరిస్థితి కాదు. పార్టీలో తలెత్తిన అసమ్మతితో తలనొప్పులు ఎదుర్కొంటోంది కాంగ్రెస్‌. మరోవైపు ఇదే వేదికపై నుంచి గులాంనబీ ఆజాద్..ప్రధాని మోడీ పనితీరును ప్రశంసించారు. ప్రధాని అయ్యాక కూడా మోడీ తన గతాన్ని ఎప్పుడూ మరిచిపోలేదన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నా గతాన్ని మర్చిపోకూడదన్నారు. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ అనే ఓ ప్రభుత్వేతర సంస్థ ఆధ్వర్యంలో రెబల్స్ లీడర్ గులాంనబీ ఆజాద్‌ ఈ శాంతి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు

తాము ఆశామాషీగా పార్టీలోకి రాలేదన్నారు మరో సీనియర్ నేత ఆనంద్‌శర్మ. దొడ్డిదారిన వచ్చిన వాళ్లం కాదన్నారు. విద్యార్థి, యువ ఉద్యమాల్లో పాల్గొన్ని పార్టీలోకి వచ్చామన్నారు. మేం కాంగ్రె‌స్ వాదులమా కాదా అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. అందరూ తమను జీ-23 అంటున్నారని.. తాము గాంధీ-23 గ్రూప్‌గా అభివర్ణించారు.

తాను రాజ్యసభ నుంచి రిటైరయ్యానని.. రాజకీయాల నుంచి కాదన్నారు ఆజాద్. పార్టీ బలోపేతం కోసం.. నవతరం, అనుసంధానం కావాల్సి ఉందన్నారు. గులాంనబీ ఆజాద్‌ వీడ్కోలు సమయంలో… ప్రధాని మోడీ, ఆయనను ఘనంగా ప్రస్తుతిస్తూ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. ఇదే తరహా గౌరవం ఆజాద్‌కు సోనియా, రాహుల్‌ల నుంచి లభించలేదు

పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ వ్యాఖ్యలు చేస్తున్నా,వారిని కట్టడి చేయడమెలాగో తెలియక… కాంగ్రెస్ అధినాయకత్వం సతమతమవుతోంది. పార్టీలో సంస్కరణలు కావాలంటూ వారు నినదిస్తుంటే.. చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోతోంది. ఆ నాయకులంటే తమకు చాలా గౌరవమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సింఘ్వీ వ్యాఖ్యలే, పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరి ఈ అంతర్గత సమస్య నుంచి కాంగ్రెస్ ఎలా బయటపడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news