టీడీపీలో ఆమె క‌ల‌లు చిగురిస్తాయా.. బాబు క‌రుణించేనా..!

-

గ్రీష్మ‌. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్గ‌త రాజ‌కీయాలు చ‌క్క‌బెడుతున్న మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి కుమార్తె. ఈమె ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు.. ప్ర‌తిభా భార‌తిని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పొలిట్ బ్యూరో స‌భ్య‌త్వాన్ని తొల‌గిం చి.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇవ్వ‌డంతో భార‌తి ఒకింత అలిగారు. దీంతో పార్టీకి, కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. ఇదిలావుంటే.. ఈ కుటుంబం ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌ను కూడా చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు తేల్చ‌లేదు.

మ‌రోవైపు.. ఇక్క‌డ త‌న స‌త్తాచాటాల‌ని త‌ల్లి వార‌స‌త్వాన్ని నిల‌బెట్టాల‌ని భావిస్తున్న భార‌తి కుమార్తె.. గ్రీష్మ .. పంచాయ‌తీలు నిర్వ‌హిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. పార్టీ త‌ర‌పున ప్ర‌త్య‌క్ష కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌క పోయినా.. పార్టీ శ్రేణుల‌తో నిరంతరం ట‌చ్‌లో ఉంటున్నారు. మాజీ మంత్రి, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన‌, కొండ్రు ముర‌ళీపై పైచేయి సాధించేలా గ్రీష్మ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు రా జాం నియోజ‌క‌వ‌ర్గంపై సేక‌రించిన నివేదిక‌లో ఇదే విష‌యం స్ప‌ష్ట‌మైంది. గ్రీష్మ దూకుడుగానే ఉన్నార‌ని తెలిసింది. అయితే.. పార్టీ త‌ర‌ఫున మాత్రం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం లేద‌న్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

ఇదిలావుంటే.. త‌న‌కు పార్టీలో గుర్తింపు వ‌స్తుందో రాదోన‌ని గ్రీష్మ ఆలోచిస్తున్నారు. మ‌రోవైపు.. చంద్ర‌బాబు ఎంతో న‌మ్మ‌కంతో తీసుకు వ‌చ్చి.. పార్టీ టికెట్ కూడా ఇచ్చిన మాజీ మంత్రి ముర‌ళీ మాత్రం పార్టీకి దూరం గా ఉంటున్నారు. ఎవ‌రితోనూ ఆయ‌న ట‌చ్‌లో లేరు. నిజానికి ఇక్క‌డ ఆయ‌న‌కు చాలా ఎడ్జ్ ఉంది. వైసీపీలో లుక‌లుక‌ల‌ను ఆయ‌నత‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఛాన్స్ ఉంది. అయితే.. ముర‌ళీ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా పార్టీ కేడ‌ర్ క‌కావిక‌లం అవుతోంది.

దీనిని గ్రీ ష్మ అందిపుచ్చుకుని.. త‌రచుగా త‌న ఇంటినే వేదిక‌గా చేసుకుని కేడ‌ర్‌ను త‌న దారిలో నడిపిస్తున్నారు. ఈ విష‌యం ఇప్పుడు చంద్ర‌బాబు చెంత‌కు చేరింద‌ని.. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఏదో ఒక‌టి తేల్చేందుకు చంద్ర‌బాబు రెడీ అవుతున్నార‌ని అంటున్నారు. మొత్తానికి గ్రీష్మ క‌ల‌లు చిగురించ‌నున్నాయ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news