సాధారణంగా మహిళలు కొన్ని సందర్భాల్లో తమ పిల్లలను కూడా తమతోపాటు తాము పనిచేసే చోటుకు తీసుకువస్తుంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అలాగే ఆ మహిళా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కూడా తన చంటి బిడ్డతో డ్యూటీకి హాజరైంది. రహదారి వద్ద ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించింది. అయితే ఆమెను చూసిన చాలా మంది విచారం వ్యక్తం చేశారు.
చండీగఢ్‌లోని సెక్టార్ 15/23లో ప్రియాంక అనే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ చంటి బిడ్డను ఎత్తుకుని రహదారిపై, దుమ్ములో డ్యూటీ చేస్తుండడాన్ని కొందరు వీడియో తీశారు. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెకు ఫీల్డ్ డ్యూటీ వేసిన పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు చేస్తున్నారు. ఆమెకు డెస్క్ జాబ్ కేటాయించి ఉండాల్సిందని, అలాగే ఆమె బిడ్డకు ఉచితంగా క్రెచ్ లేదా డే కేర్ సదుపాయాన్ని అందించి ఉండాల్సిందని అభిపాయ పడ్డారు.
ममत्व और कर्तव्य का संगम !!❤️#Chandigarh #Khaki #JaiHind pic.twitter.com/mQo4ODujgt
— SACHIN KAUSHIK (@upcopsachin) March 5, 2021
అయితే ఈ విషయంపై అక్కడి డీజీపీ సంజయ్ బనివల్ స్పందించారు. ఆమె మెటర్నిటీ లీవ్ తీసుకుని బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఒక నెల కిందటే విధులకు హాజరైందని తెలిపారు. ఆమె ఆ రోజు ఉదయం 8 గంటలకు డ్యూటీలో రిపోర్టు చేయాల్సి ఉండగా, ఆలస్యంగా వచ్చిందని, అందుకనే ఆమె స్టేషన్‌కు రాకుండా నేరుగా డ్యూటీ చేసే ప్రాంతానికే వెళ్లిందని తెలిపారు. అయితే డెస్క్ జాబ్ కావాలని రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆమెను ఆ జాబ్‌కు మారుస్తామని తెలిపారు. అలాగే ఆమెకు చైల్డ్ కేర్ లీవ్‌లు కూడా ఉన్నాయని, కావాలంటే వాటిని ఆమె వాడుకోవచ్చని తెలిపారు.