సంగారెడ్డి జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని సదా శివపేట మున్సిపాలిటి శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకన్న ను ఓ మహిళా చెప్పులతో చితకబాదింది. తన పట్ల మున్సిపాలిటి శానిటరీ ఇన్స్పెక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ..ఆ మహిళ చెప్పులతో దారుణంగా కొట్టింది. అసలు వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాలోని సదా శివపేట మున్సిపాలిటి శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకన్నను అతని కార్యాలయంలో ఇటీవలే సిద్దాపూర్ కి చెందిన సంగీత అనే మహిళ కలిసింది.
తన ఇల్లు కూలి పోయిందని.. దీంతో కొత్తగా ఇల్లు కట్టడానికి లోన్ ఇప్పించగలరని వెంకన్నను సంగీత కోరింది. ఈ సందర్బంలో సంగీత పూర్తి వివరాలు తీసుకొని.. ఆమెను హింసించడం మొదలు పెట్టాడు వెంకన్న.
ఫోన్ లో వేధించడం, అసభ్యకరంగా మాట్లాడడంతో అసలు విషయం తన భర్త కి చెప్పింది సంగీత. దీంతో ఇవాళ పగలు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి శానిటరి ఇన్స్పెక్టర్ కు దేహ శుద్ధి చేశారు సంగీత కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా వెంకన్న ను సంగీత చెప్పులతో చితకబాదింది. అక్కడితో ఆగకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనలో మున్సిపల్ కమిషనర్ రాజీకి యత్నం చేస్తున్నారు.