సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం ఎప్పటికైనా ప్రమాదకరమే. అలాంటి ఘటనే ఇది.. పరిచయం లేని వ్యక్తితో వీడియో కాల్స్ మాట్లాడిని ఓ వివాహితకు వేధింపులు ఎదురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరానికి చెందిన వివాహిత ఇన్‌స్టాగ్రాంలో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి కష్టాలు కొనితెచ్చుకుంది. వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ అడ్డం పెట్టుకొని మానసికంగా, శారీరకంగా బెదిరింపులకు దిగుతున్న వ్యక్తి వేధింపులు భరించలేక చివరకు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గూడూరుకు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రాంలో నగరానికి చెందిన వివాహితకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.
దాన్ని ఆమె యాక్సెప్ట్ చేయడంతో నిందితుడు స్నేహం పేరిట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్ చాటింగ్ ద్వారా మాయమాటలు చెబుతూ ప్రేమ పేరుతో వంచించాడు. తరువాత ఆ చాటింగ్, వాయిస్ రికార్డింగ్స్‌తో పాటు రికార్డు చేసిన వీడియో కాల్స్ ద్వారా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో ఆమె అనేకసార్లు డబ్బులు పంపించింది.
అయినప్పటికీ అతడి వేధింపులు ఆగకపోవడంతో ఆమె విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీఐ కె.భవానీ ప్రసాద్ సాంకేతికత సాయంతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన చెన్నూరు శేఖర్(24)గా గుర్తించారు. దీంతో తన సిబ్బందిని గూడూరుకు పంపించి అతడిని అరెస్టు చేసి విశాఖకు తీసుకువచ్చారు. అనంతరం ఇక్కడ కోర్టులో హాజ రుపరిచి రిమాండ్‌కు తరలించారు. శేఖర్ ఇప్పటికే ఒక హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్నాడు.