ఏడేళ్ల క్రితం బీజం పడిన ఆలోచన ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారకం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్ తీరంలో ఈ భారీ విగ్రహాన్ని ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరుకానున్నారు.
పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠంపై ఏర్పాటు చేసిన 125 అడుగుల లోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50 వేల మంది ప్రజలు తరలివచ్చేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లు చేసింది. వారంతా కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించింది. పీఠం లోపల అంబేడ్కర్ జీవిత ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాలతో ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆడియో, విజువల్ ఏర్పాట్లు, అంతర్గత ఇంటీరియర్ డిజైన్లు పూర్తయ్యాయి.
‘‘బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టితో ఆలోచించి రాజ్యాంగ రూపకల్పన చేశారు. ఆర్టికల్-3 లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కష్టమయ్యేది. అందుకే ఆ మహనీయుడి స్మారకం గొప్పగా ఉండాలనే తలంపుతో సీఎం కేసీఆర్… అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటుకు సంకల్పించారు. ఎప్పటికప్పుడు పనులను సమీక్షించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. అన్ని జిల్లాల నుంచి 50 వేల మంది ప్రజలు హాజరుకానున్నారు’’ అని వెల్లడించారు.