జగన్ ప్రభుత్వాన్ని గాని, జగన్ పై గాని ఎవరైనా విమర్శలు చేస్తే వారిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఏ స్థాయిలో ఎటాక్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు. జగన్‌ని ఒక్క మాట అంటే ఊరుకోరు. ప్రజలకు మేలు చేస్తున్న జగన్ పై విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్లు ఇస్తారు. ఆ కౌంటర్లు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఆ మధ్య ఏపీకి వచ్చి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని చంద్రబాబుని పొగిడిన రజినీకాంత్‌ని వైసీపీ నేతలు ఏ స్థాయిలో తిట్టారో చెప్పాల్సిన పని లేదు.
అంటే జగన్ పై విమర్శలు చేసిన, బాబుని పొగిడిన వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి ఉండదు. ఇక జగన్ పై ఏ పార్టీ వారు విమర్శలు చేసిన వారిని బాబు మనుషులుగా ట్రీట్ చేస్తూ వారిపై విరుచుకుపడుతుంటారు. అయితే ఇటీవల ఏపీ బిజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి..వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారిపోయిందని, ఏపీలో అభివృద్ధి లేదని, కేంద్రం నిధులు ఇస్తుంటే వాటిని డైవర్ట్ చేసి వేరే వాటికి వాడుతున్నారని, సరైన రోడ్లు కూడా లేవని, పంచాయితీ నిధులని వాడేస్తున్నారని ఆమె విమర్శలు చేస్తున్నారు.
దీంతో ఆమెపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న పురందేశ్వరి..గత చంద్రబాబు పాలనలో నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నిస్తున్నారు. మరిదిని గెలిపించడం కోసం వదిన కష్టపడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే రాజకీయంగా అంతకముందు పురందేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది తక్కువే.
కానీ ఇప్పుడు ఆమె..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో..వైసీపీ నేతలు ఊరుకోవడంలేదు. అసలు ఫ్యామిలీ పరంగా తీసుకొచ్చి టార్గెట్ చేసేస్తున్నారు. టిడిపిని గెలిపించడానికి పురందేశ్వరి కష్టపడుతున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్‌ని అంటే వైసీపీ నేతలు మాటల దాడి ఈ స్థాయిలోనే ఉంటుందని చెప్పాలి.