వైసీపీ,బీజేపీ సంబంధాల పై గతంలో ఓ ఇంటర్యూలో జగన్ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి స్నేహం లేదు అని అలా అని వైరం లేదని అంశాల వారిగా బీజేపీ ప్రభుత్వానికి సహకరించినట్లు తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వంపై గత రెండేళ్లుగా బీజేపీ కేంద్ర నాయకత్వం పల్లెత్తు మాట అన్న పరిస్థితి లేదు. ఢిల్లీ స్థాయిలో ఉన్న అవగాహన మేరకే పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు జగన్ ప్రభుత్వం పై విమర్షలు చేసిన కేంద్రంలోని పెద్దలు మాత్రం ఎప్పుడు విమర్షించలేదు. తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ చీఫ్ నడ్డా జగన్ సర్కార్ పై విరుచుకుపడిన తీరు చూస్తుంటే మాత్రం ఈ రెండు పార్టీల సంబంధం పై అనుమానాలు మొదలయ్యాయి.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కొత్త చర్చకు తెరలేపింది. ఇటీవల ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై వరసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ ఉపఎన్నికలో ఆ విమర్శల డోస్ ఇంకా పెరిగింది. ఇప్పుడు ఆ టెంపరేచర్‌ను ఇంకా పెంచారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. నాయుడుపేట ఎన్నికల సభలో పాల్గొన్న నడ్డా.. వైసీపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. గడిచిన రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఏదైనా అంటే అన్నారు కానీ.. జాతీయ నాయకత్వం మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. అందుకే నడ్డా విమర్శలు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చగా మారాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సడెన్‌గా ఎందుకు ఈ వైఖరి తీసుకున్నారు. తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నిక జరుగుతోంది కాబట్టి ఈ విమర్శలు చేశారా లేక మీరు కూడా ఇలాగే పోరాడాలని ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారా రానున్న రోజుల్లో వైసీపీతో ఎలా ఉండాలో స్పష్టత ఇచ్చారా అన్నది చర్చగా మారింది. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించిన తర్వాతే నడ్డా ఈ వైఖరి తీసుకున్నారా అన్న అనుమానాలూ ఉన్నాయట. ఇక వైసీపీ నేతలు కూడా నడ్డా విమర్శలకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. విభజన తర్వాత ఏపీకీ బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేసింది.
తిరుపతి ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో ఒక్కసారిగా రెండు పార్టీలూ కత్తులు దూసుకోవడం చూసిన వారికి కొత్తగా ఉంది. ఏపీలో బలపడాలని అనుకుంటోన్న బీజేపీ వచ్చే ఎన్నికల వరకు ఇదే వైఖరి తీసుకుంటుందా లేక తిరుపతిలో పోలింగ్ ముగిసిన తర్వాత సాధారణ స్థితికి వచ్చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మీరు ఒకటి అంటే మేం రెండు అనగలం అని వైసీపీ కూడా దూకుడు పెంచింది. ఎన్నికల తర్వాత కూడా బీజేపీ విమర్శలకు వైసీపీ దీటుగానే బదులిచ్చే అవకాశాలే ఉన్నాయి. దీంతో రెండు పార్టీల సంబంధాల పై మరోసారి చర్చ మొదలైంది.