వైసీపీ కేడర్ vs వాలంటీర్లు..మళ్లీ వార్ మొదలైందా

-

ఏపీలో వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామాల్లో వైసీపీ నేతలు కంటే వాలంటీర్లకే ఎక్కువగా జనాల్లో ఆదరణ లభించింది. దీంతో వైసీపీ నేతలను పట్టించుకునే వారు కరువయ్యారు. దీనిపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. ఎన్నికల్లో కష్టపడేది మేము.. పేరు వాలంటీర్లకా అని ఎమ్మెల్యేలను నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ స్థానిక వైసీపీ నేతలకంటే వాలంటీర్లే కీ రోల్‌ పోషించడంతో మళ్లీ వైసీపీ కేడర్ వాలంటీర్ల మధ్య కోల్డ్ వార్ మొదలైందట..

ఎమ్మెల్యేలకంటే పల్లెపోరులో వాలంటీర్లకే ఎక్కువ ఆదరణ లభిస్తుందట..చిత్తూరు జిల్లాలో వీరి హవా ఇంకాస్త ఎక్కువే ఉందట..కొన్ని ప్రాంతాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారంలో పక్కన ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు అక్కర్లేదని.. వాలంటీర్లు ఉంటే చాలన్న సందర్భాలు కనిపించాయట. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యేలు షాకైనట్టు సమాచారం. గ్రామస్థులతో వాలంటీర్లకు ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని బరిలో ఉన్న అభ్యర్థులు సైతం వారికి కొన్నిచోట్ల కాసుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఇంటింటికీ వెళ్లినప్పుడు మా తరఫున ప్రచారం చేయండి చాలు.. గెలిచాక మేం మిమ్మల్ని చూసుకుంటాం అని ఇంకొన్నిచోట్ల హామీలు ఇచ్చారట.

కొందరు వాలంటీర్లు అయితే తమ ఉద్యోగాలకు రిజైన్‌ చేసి నేరుగా సర్పంచ్‌లుగా..వార్డు మెంబర్లుగా బరిలో దిగిపోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం గంగాధరనెల్లూరులోని విజయపురం, వెదురుకుప్పంలో సర్పంచ్‌లుగా గెలుపొందింది వాలంటీర్లే. SR పురం మండలంలో మహిళా వాలంటీర్‌ 18 నెలలపాటే ఆపనిలో ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్‌గా పోటీ చేసి 241 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సాధారణంగా రాజకీయ నేతలు ఎవరైనా పోటీ చేస్తే ఆ ఖర్చు ఈ ఖర్చు అని భారీగానే చేతి చమురు వదిలిపోతుంది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసిన వాలంటీర్లు మాత్రం పెద్దగా ఖర్చు పెట్టకుండానే గెలిచేశారట.

ఇదే జిల్లాలోని కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు వాలంటీర్లు మరో రూపంలో షాక్‌ ఇచ్చారట. ఎన్నికల్లో పోటీ చేస్తాం మద్దతివ్వాలని వాలంటీర్లు కోరితే ఎమ్మెల్యేలు నో చెప్పారట. దాంతో మీ మద్దతు అక్కర్లేదు. రెబల్‌గా పోటీ చేస్తాం.. సత్తా చాటతాం అని ముఖం మీదే చెప్పినట్టు సమాచారం. దీనికితోడు అధికారపార్టీలో ఆధిపత్య పోరు ఉన్న చోట టీడీపీ నేతలు అలర్ట్‌ అయ్యారట. గుట్టుచప్పుడు కాకుండా వాలంటీర్లను బుట్టలో వేసుకుని గ్రామాల్లో పాగా వేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చినందుకు సంతోషపడాలో లేక ఏడ్వాలో తెలియడం లేదని పంచాయతీ పోరులో తలమునకలైన కొందరు వైసీపీ నేతలు ఆవేదన చెందుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news