పీఠాధిపతులతో వైసీపీ నేతల చర్చలు ఫలించినట్టేనా

-

ఏపీలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వరసగా ఆలయాలపై దాడులు జరుగుతూనే వచ్చాయి. దేవతా మూర్తుల విగ్రహాలను కూడా కొందరు ధ్వంసం చేశారు. రామతీర్థం ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై కొందరు పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నేతలు కొత్త బాట పట్టారు..

ఏపీలో ఆలయాలపై వరస దాడులతో కొంత ఇరకాటంలో పడింది జగన్ సర్కార్‌. ఇదే అంశం పై ప్రభుత్వాన్ని కార్నర్‌ చేశాయి టీడీపీ, బీజేపీ. ఇక అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఉద్యమాలు..ఉద్రిక్తతలు పరిస్థితిని వేడెక్కించాయి. కొన్ని ఘటనల్లో టీడీపీ, బీజేపీ వారి పాత్ర ఉందని పోలీసులు తేల్చడంతో వివాదం మరో మలుపు తీసుకుంది. ఈ వివాదంపై రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉన్నా.. ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై కొందరు పీఠాధిపతులు మాత్రం కాస్త ఘాటుగానే రియాక్టవుతున్నారట..

ఈ విషయం తెలుసుకున్న జగన్ సర్కార్ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది.దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి ఒక టూర్‌ వేశారు. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ఆశ్రమాలను, పీఠాలను సందర్శించారు. స్వామిజీలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించారట. పీఠాధిపతులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ పర్యటనల ద్వారా ఏ మేరకు వారు సక్సెస్‌ అయ్యారన్నది అధికార విపక్షాల మధ్య చర్చ జరుగుతోంది.

తమిళనాడులోని కంచి కామకోటి పీఠం, కుర్తాళం పీఠాధిపతులను కలిశారు. తర్వాత కర్ణాటకలో ఉన్న అవధూత గణపతి సచ్చిదానంద స్వామిని, విశ్వ ప్రసన్న తీర్థ శ్రీపాద స్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఉడిపిలో ఉన్న మద్వాచార్యులు స్థాపించిన పెజావర్ మఠానికి వెళ్లారు. జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శారదా పీఠం.. మైసూరు చాముండేశ్వరీ ఆలయాలన్నీ తిరిగారు. మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాదిలు కలిసి మాట్లాడిన స్వామిజీలకు ఆయా రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ భక్తులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అందుకే వారిని కలిసి చర్చించినట్టు తెలుస్తోంది.

ఏపీలోని ఆలయాలపై దాడుల్లో అధికార పార్టీకి ఎటువంటి సంబంధం లేదని విగ్రహాల ధ్వంసం వెనక టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉన్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారని..మంత్రి వెల్లంపల్లి, మల్లాదిలు స్వామీజీలకు వివరించారట. అలాగే టీడీపీ కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మిస్తున్నామని, దుర్గమ్మ ఆలయానికి 70 కోట్లు నిధులను ప్రభుత్వం నుంచి వెచ్చించామని కూడా తెలిపారట. ఇలా పీఠాలను, మఠాలను ప్రభుత్వ ప్రతినిధులు చుట్టేసి వచ్చారో లేదో స్వామీజీలు అంతా సమావేశమై దేవాదాయశాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆలయాల్లో దాడుల ఘటన ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news