సీమలో పల్లెపోరు ఆసక్తికరంగా మారింది. వైసీపీకి కంచుకోట లాంటి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ రెబల్స్ బరిలోదిగి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారట. ఇక్కడ అధికార, ప్రతిపక్షాల కంటే.. స్వపక్షంలోనే వైరిపక్షాలే ఎక్కువ టెన్షన్ పెడుతున్నాయట..వైసీపీ నాయకులే.. వైసీపీ వారిపై పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగు రాజకీయం రసవత్తరంగా మారడంతో ఫ్యాన్ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్యే పోరు కనిపిస్తోంది. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిన తర్వాత అప్పటి వరకు సాగిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హవాకు చెక్ పెట్టినట్టు అయింది. ఎమ్మెల్యే వైరివర్గమంతా రామసుబ్బారెడ్డి శిబిరంలో చేరింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు నేతలు కలిసి సాగాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించినా.. అన్నిచోట్ల తన అనుచరులను పోటీకి సిద్ధం చేశారు ఎమ్మెల్యే. దీనికి పోటీగా అన్నట్టు రామసుబ్బారెడ్డి వర్గం సైతం అన్ని పంచాయతీలలో తన మనషులను బరిలో దింపారట.ఈ విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు ఇద్దరు నేతలకు క్లాస్ పీకినా వీరి తీరు మారలేదట.
రెండు వర్గాలు నామినేషన్లు వేయడంతో తలపట్టుకున్న వైసీపీ పెద్దలు ఎన్నికల పరిశీలకులను జమ్మలమడుగు పంపించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్యకు పరిశీలకులు ప్రయత్నిస్తున్నారట. పరిశీలకులు చెప్పిన మీదట.. రామసుబ్బారెడ్డి వర్గం కాస్త వెనక్కి తగ్గే ప్రయత్నం చేసినా.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారట. జమ్మలమడుగు రాజకీయం రూటే సపరేట్ అని నిరూపిస్తున్నారు స్థానిక నేతలు.
జమ్మలమడుగు వైసీపీలో స్వపక్ష నేతలే వైరిపక్షంగా మారితే.. ఒకప్పుడు ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ మునుపటిలా సత్తా చాటలేకపోతోంది. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోవడంతో టీడీపీకి నేత లేకుండా పోయారు. ఇటీవల జమ్మలమడుగు టీడీపీ పగ్గాలు చేపట్టిన బీటెక్ రవి.. ఈ నియోజకవర్గంలో కొన్నిచోట్ల పార్టీ మద్దతుదారులను బరిలో దించారు. అలాగే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం బలం చాటే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులను బరిలో దించారు.
ఇలా అన్ని పార్టీలనుంచి అభ్యర్ధులున్నా ప్రధాన పోటి మాత్రం వైసీపీలోని
రెండు వర్గాల మధ్యే నడుస్తుందట.