సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరో క్లారిటీ వచ్చేసిందా

-

దుబ్బాక తర్వాత జరగబోతున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికపై విపక్ష పార్టీలు దూకుడు పెంచితే.. అధికారపక్షం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం ఇంకా ఫైన‌ల్ కాలేదు. అధికారపార్టీ శిబిరంలో అనేక మంది పేర్లపై చర్చ జరుగుతున్నా ఎందుకు ఫైనల్‌ చేయడం లేదు..కేసీఆర్ స్ట్రాటజీ వేరే ఉందా..సాగర్ సమీకరణాలు ఏం చెబుతున్నాయి అన్నదాని పై టీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది.

సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల‌ న‌ర్సింహ‌య్య అనారోగ్యంతో మృతి చెంది దాదాపు మూడు నెల‌లు కావస్తున్నా అధికారపార్టీలో అభ్యర్థివేట పూర్తికాలేదు. సీఎం కేసియార్ బ‌హిరంగ స‌భ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తి అయింది. ఆ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం అంతా ఎన్నిక‌ల ప్రచారం మాదిరే సాగింది. పార్టీకి ఓటేయండి అని చెప్పారు గానీ అభ్యర్థి ఎవ‌ర‌నేది ప్రకటించలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్దరు ముగ్గురు నాయకులు టికెట్ ఆశిస్తున్నా వడపోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

నోముల న‌ర్సింహ‌య్య త‌న‌యుడు నోముల భ‌గ‌త్ త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. త‌న తండ్రి ఉన్నప్పటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో తనకు మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని..న‌ర్సింహయ్యకు ఉన్న పేరు త‌న‌కు ఉపఎన్నికలో క‌లిసొస్తుంద‌ని చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో ఉంటే బీజేపీ కూడా బలమైన అభ్యర్థి వేటలో ఉంది. ఈ రెండు పార్టీలు అగ్రకుల నేత‌ల‌ను పోటీ పెట్టబోతున్నాయని.. బీసీనైన త‌న‌కు టికెట్‌ ఇస్తే క‌లిసొస్తుంద‌ని భగత్‌ చెబుతున్నారట. యాద‌వ సామాజివ‌ర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువ‌ని అది కూడా త‌న‌కు ప్లస్ అవుతుంద‌ని వెల్లడిస్తున్నారట.

స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటున్న కోటిరెడ్డికి టికెట్ కోసం మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ప్రయ‌త్నిస్తున్నారు. త‌న క్లాస్ మేట్ అయిన కోటిరెడ్డి ఉన్నవాళ్లలో బెస్ట్ అని హైక‌మాండ్‌కు మంత్రి ప్రతిదిపాదించినట్లు స‌మాచారం. ఎమ్మెల్యేల మ‌ద్దతును కూడా కోటిరెడ్డి కోసం కూడ‌గ‌డుతున్నట్టు తెలుస్తోంది. సీఎం దగ్గర ఈ మ‌ధ్య జ‌రిగిన స‌మావేశంలోనూ అభ్యర్థిపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అయితే సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదట.

ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డివైపు టీఆర్ఎస్ మొగ్గు క‌నిపిస్తోందట. స్థానికుడైన చిన్నపరెడ్డి అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని బలంగా ఢీ కొడతారని అధికారపార్టీ అంచ‌నా వేస్తున్నట్టు సమాచారం. వ‌చ్చే ఏడాది చిన్నపరెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం పూర్తవుతుంది. మరోవైపు ఉపఎన్నిక ఉంది కదా అని ఏదో అభ్యర్థిని ప్రకటించేయకుండా.. భవిష్యత్‌లో ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఒక బలమైన నేతలు సిద్ధం చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. చిన్నపరెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news