కాకినాడ మున్సిపాలిటీ పై వైసీపీ జెండా ఎగురుతుందా ?

-

ఇప్పట్లో కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు లేవు. కానీ.. రాజకీయం మాత్రం వేడెక్కుతోంది. టీడీపీ బలంగా ఉన్నచోట వైసీపీ మేయర్‌ వస్తారన్న ప్రచారమే దీనికి కారణం. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రాజకీయం హాట్ హాట్‌గా ఉంటోంది. మొన్నటి వరకు చిన్నగా జరిగిన చర్చ ఇప్పుడు రంగులు మారుతోంది. టీడీపీ బలంగా ఉన్న ఈ కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగిరే సమయం ఆసన్నమైందన్న సంకేతాలు వేడి పుట్టిస్తున్నాయి.

2017లో కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 డివిజన్లకు గాను 48 చోట్ల ఎన్నికలు జరగ్గా టీడీపీ 32, వైసీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు మూడు డివిజన్లలో గెలిచారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇక్కడ తెలుగుదేశం వారిదే హవా నడిచింది. కానీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడి.. వైసీపీ పవర్‌లోకి రావడంతో.. కాకినాడలోని టీడీపీ కార్పొరేటర్లు, మేయర్‌ సుంకర పావని ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. వైసీపీ కార్పొరేటర్లదే పెత్తనం.

ఈ ఏడాదిన్నర కాలంలో రాజకీయ సమీకరణాల్లో చాలా మార్పులు జరిగాయి. 32 మంది టీడీపీ కార్పొరేటర్లలో దాదాపు 25 మంది వరకు అనధికారికంగా వైసీపీకి జై కొడుతున్నారు. ఇప్పుడు లెక్క పక్కాగా ఉండటంతో మేయర్‌ సీటు పై వైసీపీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. కొద్దిరోజుల కిందటే వైసీపీ నేత జయరాం కుమార్‌ భార్య చంద్రకళదీప్తిని మేయర్‌ను చేస్తారని అనుకున్నారు. ఇంతలో జయరాం చనిపోవడంతో ఆ ప్రతిపాదన మరుగున పడింది. చంద్రకళ దీప్తికి మేయర్‌ బదులు నామినేటెడ్‌ పదవి ఇవ్వాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది.

మరో వైసీపీ మహిళా కార్పొరేటర్‌ను మేయర్‌ పీఠంపై కూర్చో బెట్టేందుకు వేగంగా వ్యూహ రచన చేస్తున్నారట. నిబంధనల ప్రకారం ఇప్పుడున్న మేయర్‌కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తి కాగానే.. చివరి ఎడాదిలో అసమ్మతి తీర్మానం ప్రవేశపెట్టి దించేయడానికి పావులు కదుపుతున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే వైసీపీ ఎత్తుగడలను పసిగట్టిన టీడీపీ నాయకులు, మేయర్‌ పావని.. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్‌ పావనికి కాకినాడలో ప్రొటోకాల్ మర్యాదలు దక్కడం లేదని చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఆమె కోర్టును ఆశ్రయించారు కూడా. చివరకు కౌన్సిల్‌ హాలులో మేయర్‌ కోసం యాంటీ రూమ్‌ ఏర్పాటు చేయడం లేదని కూడా కోర్టుకెళ్లారు. అనేక అంశాలలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అధికారపార్టీ ఏకంగా తన కుర్చీ కిందకే నీళ్లు తీసుకొస్తుండటంతో అస్సలు ఊరుకోనని చెబుతున్నారు పావని. మరి.. ఈ పొలిటికల్‌ హీట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో.. ఎవరు రంగులు మారుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news