డిస్క‌ష‌న్ పాయింట్ : తెలంగాణ వాకిట యోగి ఫ్యాక్ట‌ర్ ! ఆడు మ‌గాడ్రా !

-

ఉత్తర  భారతావనిలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం ప్రభావం మిగిలిన భారత దేశం పై ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం రాజకీయ పరిశీలకుల్లో సాగుతున్న చర్చ.ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా  ఈ ఎన్నికల ప్రభావం మరో రెండు మూడు నెలల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల పైన, ఆ తరువాత కొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల పైన  ఉంటుందనేది సత్యం,  భారత్ లోని దక్షిణాది రాష్ట్రాలలో తమ ప్రాభవాన్ని పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో వేచి చూస్తోంది. ఆ దిశగా అడుగులు వేసింది కూడా. వాటి ఫలితంగానే కర్ణాటక రాష్ట్రం ప్రస్తుతం బిజేపి ఏలుబడిలో ఉంది.

ఇక పై భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి సారిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన దూబ్బాక ఉపఎన్నికల్లో బిజేపి అభ్యర్థిని నిలబెట్టి,  విజయం తన ఖాతాలో వేసుకుంది. రఘనందన్ రావును శాసన సభ్యుడిగి చట్ట సభల్లోకి పంపింది. ప్రజల వాణిని వినిపిస్తోంది. ఆ తరువాత  జరిగిన గ్రేటర్ హైదరాబాద్  మున్సిపల్ ఎన్నికలలో భారతీజ జనతా పార్టీ  తన ఉనికిని చాటుకోవండంతో పాటు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్ ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెఱువుల నీరు తాగించింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ ఎన్నికల్లో విజయం టిఆర్ ఎస్ ను వరించినా,  భవిష్యత్తులో బిజేపి ఒక్కటే టిఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం అంటూ జనావళికి చాటి చెప్పింది.
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా చెప్పనఖ్ఖర లేదు. తెలంగాణ పోరాట యోధుడుగా పేరుగాంచిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అతనిని ఓడించేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ పార్టీ సామదాన భేద దండోపాయాలను ఉపయోగించింది. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించింది. అధికార దర్పాన్ని ప్రదర్శించింది. వరాల వర్షం కురుపించింది. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కొత్త కొత్త పథకాలు పుట్టుకువచ్చాయి.  కానీ హుజూరాబాద్ ప్రజలకు చక్కని తీర్పు నిచ్చారు. తమకు అందుబాటులో ఉండే నేతకు పట్టం కట్టారు. ఈటల రాజేందర్ అఖండ విజయం సాధించారు. నాటి నుంచి తెలంగాణలో  భారతీయ జనతా  పార్టీ అదే ఊపును కొనసాగిస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసన సభ సమావేశాల్లో బిజేపి సభ్యుల వాగ్దాటికి టిఆర్ ఎస్ నేతలు సమాధానం చెప్పలేక బిక్కముఖం వేస్తున్న దృశ్యాలను మనం నిత్యం ప్రసార మాధ్యమాలలో చూస్తున్నాం.

తాజాగా ఉత్తర భారతావనిలో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘనవిజయం ప్రభావం తప్పకుండా తెలంగాణ పై ఉంది. భారతదేశ భవిష్యత్ అంతా కూడా ఇకపై బిజేపి పైనే ఆధారపడి ఉంది అని దేశ ప్రజలు నమ్ముతుండటంతో తెలంగాణలోనూ నేతల చూపు బిజేపి పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ ఎస్ పార్టీ అధినేత  పోకడలు నచ్చని చాలామంది నేతలు గత కొన్ని గంటలుగా తమ సన్నిహితులతో భవష్యత్ లో జరనున్న పరిణామాలపై చర్చలు సాగిస్తున్నారు. అభివృద్ధి, సుపరిపాలన పట్ల యోగి ఆదిత్యనాథ్ ప్రదర్శించిన ధృఢ చిత్తం కారణంగానే విప్లవాత్మక రీతిలో ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇదే అంశాన్ని బిజేపి శ్రేణుల్లో ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో అంతర్నిహితంగా ఉన్న ఈ నిర్మాణాత్మక శక్తి,  సామర్థ్యాలు ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

— వెన్నెలకంటి శ్రీధర్,
సీనియర్ పాత్రికేయులు, నెల్లూరు

Read more RELATED
Recommended to you

Exit mobile version