ఏపీ సీఎం జగన్ చేతులు ఎత్తేశారా? రాష్ట్రంలో విజృంభించిన కరోనాను కట్టడి చేయడం ఇక, తన వల్లకాదని ఆయన ఒప్పేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. నిన్న మొన్నటి వరకు కూడా తనకు తిరుగులేదని, దేశంలో కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే తనదేనని చెప్పుకొచ్చిన జగన్.. వైరస్‌ను కూడా చాలా తక్కువగానే అంచనా వేశారు. మార్చిలోను, తదుపరి ఏప్రిల్, మే మాసాల్లోనూ ఆయన చేసిన ప్రసంగాలు అనేక విమర్శలకు తావిచ్చాయి. అయినప్పటికీ.. ఆయనతన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. పైగా లాక్‌డౌన్‌ను ఎంత త్వరగా ఎత్తేస్తే అంతమంచిదనే అభిప్రాయంతో ఉన్నారు.
ఈ క్రమంలోనే కేంద్రం అవకాశం ఇచ్చిందే తడవుగా రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. మద్యం షాపులు తెరిచేశారు. ఇక, కరోనాఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్ వెసులుబాట్లు బాగానే కల్పించారు. దీంతో కరోనా ఉన్న రోగులు కూడా సాధారణ ప్రజల మాదిరిగా రోడ్ల మీదకి వచ్చేశారు. దీనిని అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రమాదకర కరోనా వ్యాప్తి ఉన్న రాష్ట్రాల్లో ముందు వరుసలో నిలబడింది. అయితే, ఆదిలో ఉన్న ప్రభుత్వ కట్టడి ఎందుకు తర్వాత తర్వాత పలచన అయింది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆదిలో వాలంటీర్లను ఇంటింటికీ పంపించి మరీ.. ప్రజల ఆరోగ్యం చెక్ చేయించారు.
టెలీ మెడిసిన్ ను రాత్రికి రాత్రి తెచ్చారు. 104, 108 వాహనాలను రంగంలోకి దింపారు. హోమియో మందులు గడపగడపకు చేరవేశారు. ఇంతలా ముందుగా కరోనాపై పోరుకు సిద్ధమైన రాష్ట్రంగా గొప్పగా భావించిన సమయంలో ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ప్రజల ప్రాణాలకు పూచీలేకుండా పోయింది. టెస్టులు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కరోనా నుంచి ప్రజలను రక్షించడంలో మాత్రం విఫలమైందనే వాదన వినిపిస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2500లకు చేరువ అయింది.
కేసులు రెండు లక్షలకు పైగా చేరిపోయాయి. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు చేతులు ఎత్తేసింది. నిన్న మొన్నటి వరకు మేమే ఎవరికైనా సాయం చేయగలమనే స్థాయిలో ఉన్న సర్కారు ఇప్పుడు కేంద్రాన్ని యాచిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం జగన్‌కు మైనస్‌గా మారిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం. మరి దీని నుంచి జగన్ ఎలా బయట పడతారో చూడాలి.