అవును! ఇప్పుడు చాలా మంది రాజకీయ నేతలు.. విశ్లేషకులు కూడా ఇదే మాట అంటున్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ ఎఫెక్ట్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్ని దారులూ మూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. అమరావతి తరలిపోవడమే! ఇది రాజకీయంగానే కాదు.. ఆర్థికంగా కూడా చంద్రబాబు కుంగదీసేస్తుంది. అంతేకాదు.. నైతికంగా కూడా చంద్రబాబు ఓ వందేళ్లు వెనక్కి వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అమరావతిని బూచీగా చూపిస్తూ రాజకీయం చేయడంతో పాటు అటు ఆర్థికంగా కూడా లాభంగా కూడా మారింది. టీడీపీ వాళ్లు ఇక్కడ ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ చేసి ఎంతలా లాభపడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ మూడు విషయాలు పరిశీలిస్తే అమరావతి దెబ్బ చంద్రబాబుకు ఎంతలా తగిలిందో అర్థం చేసుకోవచ్చు..
1. రాజకీయ కారణం: జగన్ దెబ్బతో చంద్రబాబు పార్టీ తీవ్రంగా దెబ్బతింది. రేపు జిల్లాల ఏర్పాటుతో మరింతగా టీడీపీ కోలుకోలేని దెబ్బతింటుంది. ఇక, అమరావతిని కాపాడుకోలేని నేతగా ఆయన పార్టీలో నేతలకు మరింత చులకన అవుతారు. అదే సమయంలో ఇప్పటికే చాలా మంది తిరుగుబాటలో ఉన్నారు. కొందరు ఇప్పటికే జెండా మార్చేశారు. ఇది మరింత తీవ్రం అవుతుంది. జగన్ కనుక మూడు రాజధానులకు ఓకే అనిపించుకుంటే.. ఇంత వ్యతిరేకతలో ఆయన సాధించగలిగితే.. ఆయనే నిజమైన పొలిటికల్ లీడర్ అవుతారు. సో.. అప్పుడు పార్టీకే ముప్పు.
2. ఆర్థికంగా దెబ్బ: అవును. చంద్రబాబు ఆర్థికంగా అండదండలు అందించే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు.. పరిశ్రమాధిపతులు ఆయనకు పార్టీ అధికారంలో లేనప్పుడు పూర్తిగా సహకరించారు. వీరంతా ఆయనను నమ్మి.. అమరావతిలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు జగన్ కనుక మూడు రాజధానులకు జై కొట్టించుకుంటే.. చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని ఆపలేక పోతే.. ఖచ్చితంగా వీరంతా కూడా బాబును పక్కన పెట్టి ప్రత్యామ్నాయం చూసుకుంటారు.
3. నైతికంగా మరింత: అంతా నేనే.. అంతా నాదే.. నేను చెప్పిందే జరుగుతుంది.. అంటూ.. అధికారంలో ఉండగా చెప్పిన చంద్రబాబు తన నైతికతను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే జనాలకు, తన సొంత సామాజిక వర్గానికి కూడా అమరావతి సినిమా చూపించారు. ఇప్పుడు దీనికి జగన్ ఎసరు పెట్టారు. ఇప్పుడు కనుక చంద్రబాబు తన జీవితేచ్ఛగా చెప్పుకొచ్చిన ఈ అమరావతిని నిలబెట్టుకోలేక పోతే.. నైతికంగా ఆయన చెప్పినవన్నీ కూడా వృథా అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చంద్రబాబు అన్ని రూపాల్లోనూ తన స్తాయిని దిగజార్చుకున్నట్టే అవుతుంది.