మంత్రి సుచ‌రిత చుట్టూ.. ముప్పేట రాజ‌కీయం..!

-

సీఎం జ‌గ‌న్ కేబినెట్లో హోం శాఖ‌ను నిర్వ‌హిస్తున్న మంత్రి సుచ‌రిత చుట్టూ.. ముప్పేట దాడి జ‌రుగుతోంది. రాష్ట్రంలో హోం శాఖ‌ను ఎస్సీ వ‌ర్గానికి కేటాయించిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కినా.. ఆ వ‌ర్గానికి అనేక రూపాల్లో అన్యాయం జ‌రుగుతున్నా.. ఆమె స్పందించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ఎస్సీ వ‌ర్గాలు స‌హా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది ఒక కోణ‌మైతే.. తాను మంత్రినే అయిన‌ప్ప‌టికీ.. త‌న‌కు స్వతంత్ర‌త లేద‌ని ఆమె వాపోవ‌డం మ‌రో కోణం. ఈ రెండు కార‌ణాల‌తో మంత్రిగా అసలు సుచ‌రిత పాత్ర ప్ర‌భుత్వంలో ఏమేర‌కు ఉంద‌నేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలైన సుచ‌రిత‌.. వైఎస్ ఆశీర్వాదంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2006లో ఆమె ఫిరంగిఫురం జ‌డ్పీటీసీగా విజ‌యం సాధించి నాడు గుంటూరు జ‌డ్పీచైర్మ‌న్ రేసులో నిలిచారు. అయితే అప్పుడు జ‌డ్పీచైర్మ‌న్ పీఠం కాస్తా చేజారింది. వైఎస్ ఆమెను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ 2009లో ప్ర‌త్తిపాడు సీటు ఇప్పించి ఎమ్మెల్యేను చేశారు. ఆయ‌న త‌ర్వాత ఆయ‌న కుటుంబానికి కూడా క‌లిసి ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనేజ‌గ‌న్ ఆమెకు ఏకంగా హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఓ ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌కు హోం మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

అయితే, ప‌ద‌వి చేప‌ట్టిన నాలుగు నెల్ల‌లోనే ఆమెపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సీఐల బ‌దిలీల్లో మంత్రి కుటుంబ స‌భ్యులు జోక్యం చేసుకున్నార‌ని ఏకంగా సీఎం జ‌గ‌న్‌కే ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయ‌న ఆమె అధికారాల‌ను అలానే ఉంచినా.. నిఘాను పెంచార‌న్న టాక్ వ‌చ్చింది. దీంతో మంత్రి ఏం చేస్తున్నా సీఎంవోకు తెలుస్తోంది. దీంతో మంత్రి దూకుడు త‌గ్గించారు. ఇక‌, గుంటూరుకు చెందిన రాజకీయాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన నాయ‌కుడు, జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర బంధువు ఒక‌రు వేలు పెట్టారు. అంతా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే సాగుతోంద‌ని కొన్నాళ్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో సుచ‌రిత ఏం చేయాల‌న్నా.. ఆయ‌న అనుమ‌తి తీసుకుంటేనే త‌ప్ప సాధ్యం కావ‌డం లేద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల తూర్పుగోదావ‌రి, ప్ర‌కాశం జిల్లాల్లో పోలీసులు ఎస్సీ వ‌ర్గానికి చెందిన యువ‌కుల‌పై అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే శిరోముండ‌నం జ‌ర‌గ్గా.. ఓ వ్య‌క్తి మృతి చెందారు. ఈ రెండు ఘ‌ట‌న‌లకు సంబంధించి మీడియా స‌మావేశం పెడ‌తాన‌న్న‌మంత్రికి స‌ద‌రు నాయ‌కుడి నుంచి ఇప్పుడు వ‌ద్దు.. అని సందేశం రావ‌డంతో ఆగిపోయార‌న్న టాక్ కూడా లీక్ అయ్యింది. ఇక జిల్లా స్థాయిలో కూడా సుచ‌రిత సొంత నిర్ణ‌యాలు తీసుకునే ఛాన్స్ లేద‌ట‌. బ‌దిలీలు ఏం జ‌ర‌గాల‌న్నా కూడా స‌ద‌రు జ‌గ‌న్ బంధువు చెపితేనే ప‌నులు అవుతున్నాయ‌ని అంటున్నారు. మ‌రోప‌క్క‌, ప్ర‌తిప‌క్షాల‌తో పాటు ఎస్సీ వ‌ర్గాల్లో కొంద‌రు మాత్రం మంత్రిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో సుచ‌రిత ప‌రిస్థితి మింగ‌లేక .. క‌క్క‌లేక అన్న‌ట్టుగా త‌యారైంద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news