ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడ బిడ్డలకు అండగా ఉండేందుకు ముఖ్యంగా అగ్ర వర్ణాలకు చెందిన పేద మహిళలకు తనవంతుగా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఈబీసీ నేస్తంతో ఇవాళ ముందుకు వచ్చారు. ఈ పథకం లక్ష్యం అనుసారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా లబ్ధి అందనుంది.వీటితో పాటు మరికొన్ని పథకాల అమలుకూ తాము ప్రాధాన్యం ఇస్తున్నామని వైసీపీ చెబుతోంది. ఆ వివరం ఈ కథనంలో…
ఆర్థిక పురోగతి అంతగా లేకపోయినా కూడా ఇచ్చిన మాటకు విలువ ఇస్తూ,కట్టుబడి ఉంటూ ముఖ్యమంత్రి తన హామీలను నిలబెట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో భాగంగా ఇవాళ ఆయన అగ్ర వర్ణ పేదలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి 15 వేలు చొప్పున ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు సంబంధించి అర్హుల జాబితాలను కూడా జిల్లాల్లో అధికారులు సిద్ధం చేశారు. అగ్రవర్ణ పేద మహిళలకే కాకుండా మిగిలిన కులాలకు చెందిన వారిని కూడా తమ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆదుకుంటుందని జగన్ ఇవాళ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈబీసీ నేస్తం పేరిట అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి,కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమతో సహా ఇతర అగ్రవర్ణాలనూ ఆదుకునేందుకు ఈబీసీ నేస్తం ను అమలుకు శ్రీకారం దిద్దారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల మహిళలకు చేయూత ఇచ్చేందుకు సీఎం ప్రవేశ పెట్టిన ఈబీసీ నేస్తం పథకం కింద 3,92,674 మంది 589 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఈబీసీలకు ఏటా 15 వేలు చొప్పున మూడేళ్ల పాటు 45 వేలు రూపాయలు వారి అకౌంట్లకు జమ చేయనున్నామని జగన్ చెబుతున్నారు.
మరికొన్ని పథకాలు
– వైఎస్సార్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల మహిళలకు 18,750 రూపాయలు చొప్పున
నాలుగేళ్ల పాటు అందివ్వనున్నారు.
– వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు కాపు,బలిజ, ఒంటరి సామాజికవర్గ మహిళలకు 15వేల రూపాయలు చొప్పున ఐదేళ్ల పాటు అందివ్వనున్నారు.
– 60 ఏళ్లు పైబడిన పేద మహిళలకు వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట నెలకు 2,500 రూపాయలు చొప్పున పింఛను అందిస్తున్నారు.
అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకూ..అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి
ఆదుకుంటున్న ప్రభుత్వం తమదేనని ఈ సందర్భంగా జగన్ చెబుతున్న మాట.