“నన్ను సీఎంను చేసిన ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. ఆరు మాసాల గడువు ఇవ్వండి. నేనేంటో చూపిస్తాను. వ్యవస్థను ప్రక్షాళనచేస్తాను“-అని సీఎంగా ప్రమాణం చేసిన రోజు ప్రకటించిన వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆరు మాసాలు గడవ కుండానే తనేంటో చూపిస్తున్నారా? వ‌్యవస్థలో మార్పు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు విమర్శకులు సైతం. రాజకీయంగా మిగిలిన రాష్ట్రాలకు, ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. అనుభవం ఉన్న పాలకుడు అని గడిచిన ఐదేళ్లపాటు ఏపీ ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు.
ముఖ్యంగా విభజనతో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన గట్టెక్కిస్తారని అనుకున్నారు. అయితే, అనూ హ్యంగా ఆయన పాలనా కాలంలో ఓవర్ హెడ్ ట్యాంక్ శుభ్రంగానే ఉన్నా.. తాను అవినీతికి పాల్పడలేదని చెబుతున్నా.. కింది స్తాయిలో జరిగిన అవినీతిని కట్టడి చేయడంలో మాత్రం విఫలమయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు చాలా మంది తమ తమ నియోజకవర్గాలలో రెచ్చిపోయినా చూస్తూ… కూర్చున్నారు. ఫలితంగా ప్రజలు ఆయనను, పార్టీని కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలోనే అధికార పగ్గాలు చేపట్టిన జగన్.. తానేంటో చూపించేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రతి నెలా కొన్ని టార్గెట్లు పెట్టుకుని, ప్రతి నెలా కొన్ని కొత్త పథకాలను ముందుకు తీసుకు వచ్చే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగుతున్నారు. సంక్షేమ పథకాలకు సాన పడుతున్నారు. ప్రతి ఒక్క అర్హుడికి ఇంటికే ప్రభుత్వ పథకాలు అందాలనే దృఢ దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ వలంటీర్ వ్యవస్థను, గ్రామస్వరాజ్యానికి ముడి పెట్టి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో ఏం జరిగినా..క్షణాల్లో తనకు తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అధికార పార్టీనుంచి విపక్షాల వరకు ఏ ఎమ్మెల్యే కూడా తప్పు చేస్తే.. సహించేది లేదని చెబతున్నారు. అవినీతి రహితంగా పాలన ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దీనిని గమనిస్తున్న విమర్శకులు సైతం.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఆరు మాసాలకంటే ముందుగానే జగన్ తాను అనుకున్నది సాధించడం ఖాయమని అంటున్నారు.