జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పక్షంపై నిత్యం విమర్శలు సంధిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తుండటంతో చూసే జనాలకు, పథకాలు లబ్ధి పొందుతున్న ప్రజలకు పవన్‌పై ఏవగింపు కలుగుతుంది. అయితే పవన్ మాత్రం నేను చేస్తున్న రాజకీయం బాగానే ఉందని, రాజకీయ విమర్శలు కూడా మంచిగా ఉన్నాయని భావిస్తూ మరింత రెచ్చిపోతున్నారు. కానీ పవన్ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ఎక్కడో హైదరాబాద్ ఫామ్ హౌస్‌లో పడుకుని, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారు.
అయితే పవన్ విమర్శిస్తుండటంతో అది జగన్ సర్కారకు ఇబ్బందిగా మారింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఒక్కోసారి ఎలా ఉంటున్నాయంటే అది ఓ రాజకీయ నాయకుడు చేసే విమర్శలుగా కాకుండా సినిమాల్లో పంచ్ డైలాగ్‌లు వేసే సైడ్ హీరోగా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా వీటిని పట్టించుకోకుండా పవన్ జగన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల పవన్ ఇసుక పేరుతో, ఇతర సంక్షేమ పథకాలపై చేసిన విమర్శలకు అధికార పక్షం దీటుగా స్పందించింది.
ఇసుక పేరుతో పవన్ చేసిన రాజకీయాన్ని జగన్ నేతృత్వంలోని అధికార పక్షం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొందో తెలిసిందే. అయితే ఇటీవల సీఎం జగన్ తెలుగు మీడియంకు బదులు ఇంగ్లీష్ మీడియం చదువులను సర్కారు బడుల్లో ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై ఒంటికాలుపై లేచి విమర్శలు చేస్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సామాన్య జనం, మేధావులు స్వాగతిస్తుంటే, జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాజకీయ పక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.
అయితే ఈ వ్యవహారం ఎంత వరకు దారి తీసిందంటే అది పవన్ కళ్యాణ్ పరువును బజారులో పెట్టెంత వరకు వచ్చింది. పవన్ లాంటి వ్యక్తి సామాన్య జనం పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందాలని కోరుకోవాలి. కానీ, ఇంగ్లీష్ మీడియం వద్దు.. తెలుగు ముద్దు అని మాట్లాడటం చూస్తుంటే సామాన్య జనాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువొద్దు అనేలా ఉందనే విమర్శలు ప్రజల నుంచి వస్తుంది.
ఇదే అదనుగా ఏపీ సిఎం జగన్ పవన్‌ను గురి చూసి కొట్టాడు. రాజకీయ, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటున్న జగన్ పవన్ కళ్యాణ్‌పై ఏకంగా ముగ్గురు పెండ్లాల ముద్దుల రాజకీయ నాయకుడిగా అభివర్ణించాడు.
ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నాడు పవన్.. మరి ఆయనకు ముగ్గురు భార్యలు… ఐదుగురు పిల్లలు.. వారు ఏ మీడియంలో చదువుతున్నారు.. తెలుగు ముద్దు అంటున్న పవన్ ఆయన పిల్లలను కూడా ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదు.. ఆయన పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి.. కానీ పేద ప్రజల బిడ్డలు ఇంగ్లీష్ చదువులొద్దా… తెలుగులోనే పవన్ పిల్లలు ఎందుకు చదివించడం లేదు అని ఘాటుగా, సూటిగా ప్రశ్నించాడు జగన్. జగన్ వేసిన ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేని పవన్ ఇప్పుడు డొంకతిరుగు విమర్శలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ జగన్ వేసిన ప్రశ్నతో పవన్ ఉక్కిరి బిక్కిరి అవ్వడమే కాకుండా, జనాల్లో పవన్‌ను పలుచన చేశాడనే అనిపిస్తుంది.
ఓ రాజకీయ నాయకుడు చేసే విమర్శలు అర్ధవంతంగా ఉండాలి.. కానీ అభాసుపాలు కాకుండా ఉండకూడదు.. కానీ పవన్ చేస్తున్న విమర్శలు వ్యక్తిగతంగా అబాసు పాలు చేసుకునేలా ఉన్నాయి. ఇప్పుడు జగన్ చేసిన విమర్శలు నిజమే అవుతున్నాయి. ఎందుకంటే పవన్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పుడు పేద ప్రజల పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నాటుకుపోయోలా ప్రశ్నించాడు జగన్. అదును చూసి కొట్టిన జగన్ దెబ్బ కొడితే అది పవన్‌కు పక్కలో బల్లేంగా తాకిందనే అనిపిస్తుంది. ఇకనైనా పవనాలు పసలేని విమర్శలు చేసి ప్రజల్లో పలుచన కావొద్దని తెలుసుకుంటే మంచిది.