ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే అని పాడుకునేందుకు వీల్లేని స్థితిలో కొందరు నాయకుల జీవితం ఉండిపోతుంది. ఇందుకు వల్లభనేని వంశీనే ఉదాహరణ. అందుకు కారణాలు ఏమయినా కూడా సమస్య మాత్రం ఒకంతట పరిష్కారం కావడం లేదు.
టీడీపీలో ఇమడలేని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆఖరుగా వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇక్కడ కూడా ఆయనకు పరిణామాలు అనుకూలించడం లేదు అన్నది సుస్పష్టం. దీంతో రానున్న కాలంలో వల్లభనేని వంశీ రాజకీయంగా ఎదిగేందుకు ఛాన్సే లేకుండా ఉంది. వైసీపీలో కూడా ఇప్పటికప్పుడు ఆయనను సొంతం చేసుకునే వారు కూడా లేరు. ఆయన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యల కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.
అవి వైసీపీ అంతర్మథనానికి కారణం అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు మనకూ ఆయనకూ ఎటువంటి సంబంధం లేదని చెబితే కాస్తయినా డ్యామేజ్ కంట్రోల్ చేసిన వాళ్లం అవుతామని వైసీపీ భావిస్తోంది. అందుకే ఎక్కడిక్కడ నష్ట నివారణకు పూనిక వహిస్తోంది. తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పూర్తిగా వంశీ రాజకీయ జీవితాన్నే ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఆయనకూ మాకూ సంబంధం లేదు .. ఆయన టీడీపీ బీ ఫాంపై గెలిచారు.. అని చెప్పి పెను సంచలనమే రేపారు.
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో టీడీపీ నుంచి దూరం అయిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు సంబంధించి కీలక సమాచారం ఒకటి వెలుగులోకి వస్తోంది. ఆయన వ్యవహార శైలికి సంబంధించి ఇప్పటికే వైసీపీలో దుమారం రేగుతుండడంతో, ఇప్పుడిప్పుడే ఒక్కో ఎమ్మెల్యే తమ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. తాజాగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు.
వంశీ వైఖరికి పార్టీకి సంబంధం లేదని తేల్చేశారు. అదేవిధంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కూడా వంశీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడిగేందుకు అయినా తాను సిద్ధమేనని ఎప్పుడో ప్రకటించారు. దీంతో ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే వంశీ ఓ ఛానెల్ వేదికగా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పినా కూడా వివాదం ఆగే విధంగా లేదు.