రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని… ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం కాలేదు కానీ.. రాజధాని త్వరలో రావడం ఖాయమని ఆయన ప్రకటించారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు తగ్గట్టుగా విశాఖ కేంద్రంగా అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. భూమి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచడం జరుగుతుందని స్పష్టం చేశారు.
అలాగే మురికివాడల అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ ఆలోచన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారని కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. విశాఖలో తాగునీటి సమస్య లేకుండా రూ. 500 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని.. త్వరలోనే దానిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖలో మొత్తం ఎనిమిది కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తున్నామని ప్రకటన చేశారు. ఒక్కో జోన్లో ఐదు కోట్ల చొప్పున అంచనాలతో కన్వెన్షన్ సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు.