రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేని పరిస్థితి. పదవులు దక్కాయన్న ఆనందం ఒకవైపు నవ్విస్తుంటే.. కీలకమైన సమస్యల సుడిలో దిగి.. సమాధానం చెప్పుకొవాల్సి వస్తుందనే వేదన మరో వైపు నేతలను ఇప్పుడు వెంటాడుతోంది. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే.. నాయకులకు దిమ్మతిరిగి పోయేలా చేస్తుంది. గుంటూరు జిల్లాకు అత్యద్భుతమైన అవకాశం దక్కింది. ఒక బీసీ, ఒక ఓసీ.. వర్గానికి చెందిన ఇద్దరు కీలక నాయకులను వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రాజ్యసభకు ప్రమోట్ చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణారావు మాజీ మంత్రి. సమకాలీన రాజకీయాల్లో దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతోంది.
మరో నాయకుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. ఈయన రాజకీయాలను ప్రత్యక్షంగా ఇప్పటి వరకు చేయకపోయినా.. తాజాగా మాత్రం రాజ్యసభలో అడుగు పెట్టారు. ఆళ్ల 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఇక మోపిదేవి, ఆళ్ల వీరిద్దరూ కూడా గుంటూరు జిల్లా వారే కావడం గమనార్హం. దీంతో ఒకే జిల్లా నుంచి ఇద్దరు సభ్యులు రాజ్యసభలో ఒకే సమయంలో ప్రాతినిధ్యం కలిగి ఉండడం అనేది నిజంగానే ఆసక్తికర అంశం. అయితే.. ఎవరిమాట ఎలా ఉన్నప్పటికీ.. వీరిద్దరికీ మాత్రం ఇబ్బందులేనని అంటున్నారు.
ఇంతకీ చిక్కు ఎక్కడ వచ్చిందంటే.. రాజధాని మార్పు.. లేదా అమరావతి మార్పు విషయంపై ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించిన బిల్లును గవర్నర్‌ను ఆమోదించరాదని కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం దీనిని ఏదో ఒకరకంగా ఆమోదించుకోవాలని చూస్తోంది. దీంతో ఇది రగడకు దారితీసింది. అయితే, ఇదే విషయంపై పార్లమెంటులో ప్రస్థావించాలని బీజేపీ, టీడీపీ సహా ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. దీనిని బట్టి పెద్దల సభలో ఈ విషయం ప్రస్థావనకు వస్తే.. బీజేపీ సభ్యుల బలం ఎక్కువగా ఉంది. నలుగురు ఎంపీలు వారి పక్షాన ఉన్నారు. ఇక, ఆ సమయంలో గుంటూరు ఎంపీలుగా ఆళ్ల, మోపిదేవిలు ఎలా ముందుకు సాగుతారనే వాదన తెరమీదికి వచ్చింది.
వీరు ఏం చేస్తారు. గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి.. జిల్లా ప్రయోజనాల నేపథ్యంలో అమరావతి ఇక్కడే ఉండాలని అంటారా ? లేక.. వైఎస్సార్ సీపీ ప్రయోజనాల కోసం తరలింపు కోరతారా ? ఎలాగైనా.. ఈ ఇద్దరు ఎంపీలకు గుంటూరు జ్వరం బాగానే సోకే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏవిధంగా వ్యవహరిస్తారో.. వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే స్పష్టం కానుందని అంటున్నారు పరిశీలకులు.