రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు మామూలే. అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థులపైనా.. ప్రత్యర్థి పక్షంలో ఉన్న పార్టీ అధికార పార్టీపైనా వ్యూహ ప్రతివ్యూహాలతో విరుచుకుపడడం మామూలే. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరుగుతోంది. అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. తాము ప్రతిపక్షంలో ఉండగా .. తమ పార్టీని దెబ్బకొట్టాలని ప్రయత్నించిన టీడీపీపై అంతే రేంజ్‌లో రివేంజ్ పాలిటిక్స్‌కు తెరతీసింది. ఈ క్రమంలో ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ పార్టీకి, తన పదవికి కూడా రాజీనామా చేశారు.
త్వరలోనే వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. ఇప్పుడు టీడీపీకి నిన్న మొన్నటి వరకు కంచుకోటగా ఉన్న ప్రకాశం జిల్లాపైనా వైసీపీ దృష్టి పెట్టింది. ఈ జిల్లాలోని కీలక టీడీపీ నేతలను పార్టీలోకి తీసుకునేందుకు వైసీపీవ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ బాధ్యతలను పార్టీలో సీనియర్ , మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలకు వైసీపీ అధినేత, సీఎం జగన్ ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.
దీంతో వారిద్దరూ ఇప్పటికే జిల్లాలో టీడీపీ నుంచి జంప్ చేసేందుకు రెడీగా ఉన్న నాయకులపై దృష్టి పెట్టారు. ఈ జిల్లాలో మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిచారు. కొండపి, చీరాల, అద్దంకి, పరుచూరు నియోజకవర్గాలకు చెందిన వారిలో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన అద్దంకి, చీరాల ఎమ్మెల్యేలు వైసీపీవైపు చూస్తున్నారు. అయితే, వీరిలో అద్దంకి ఎమ్మెల్యే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేయడం, జగన్‌పై గతంలో కామెంట్లు చేసి ఉండడంతో ఆయనను పక్కన పెట్టి, చీరాల నుంచి గెలిచిన కరణం బలరాంను పార్టీలోకి తీసుకునేందుకు వైసీపీ మొగ్గు చూపుతోంది.
ఈయన చంద్రబాబుకు సమకాలికుడు, పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్నారు. దీంతో ఈయనను తీసుకోవడం ద్వారా టీడీపీని దెబ్బకొట్టాలని వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుంది. అదే సమయంలో వైసీపీలోనే ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు కూడా ఈ క్రమంలోనే ఆయన దూకుడు చెక్ పెట్టాలని కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.