21 రోజులు, ప్రపంచాన్ని మర్చిపోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి…!

92

21 రోజులు మీకు పిల్లల చదువులు లేవు, 21 రోజులు మీకు బంధువులు లేరు, బంధాలు లేవు, 21 రోజులు వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, 21 రోజులు అసలు బయట ఒక ప్రపంచమే లేదు. 21 రోజులు అసలు బయట ఎం జరుగుతుందో మీకు అనవసరం. 21 రోజులు మీకు అంటూ ఏ అవసరం లేదు. 21 రోజులు మీకోసం బయట ఎదురు చూసే వాళ్ళు ఎవరూ లేరు. 21 రోజులు బయటకు వెళ్తే మిన్ను విరిగి మీద పడుతుంది.

క్రికెట్ లేదు, వాకింగ్ లేదు, కుక్క పిల్లను తీసుకు వెళ్ళేది లేదు, బట్టల ఇస్త్రీ లేదు. కొత్త బట్టలు అసలు అవసరమే లేదు, బ్యాంకింగ్ గోల లేదు. దయచేసి ఈ 21 రోజులు మీ కళ్ళకు మీరు బంధాలు వేసుకుంటే మీరు చాలా సంతోషంగా ఉండవచ్చు. ఈ 21 రోజులు మనని మనం కంట్రోల్ చేసుకుంటే మనం పుట్టిన దేశానికి ఎంతో సేవ చేసినట్టు. దయచేసి ఎవరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం ఏ విధంగానే చేయవద్దు.

మనకు అసలు బయట పని లేదు. కూరగాయలు తెచ్చుకుంటే వెళ్లి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. అంతే గాని పని లేని పనికి వెళ్ళడం పిల్లల ట్యూషన్ అంటూ తిరగడం, సోది కార్యక్రమాలు చేయడం ఏమీ చేయవద్దు. కనీసం అపార్ట్మెంట్ లో పక్క ఫ్లాట్ తో కూడా మీకు అవసరం లేదు. మీ ఇంట్లో మీరు ఉండండి మీ తిండి మీరు తినండి. వదినా బాగున్నావా అని మీ ఫ్లాట్ నుంచి అడగండి గాని అక్కడికి వెళ్లి అయ్యో వదిన, ఎం కూర వండా వదినా అంటూ మోహంలో మొహం పెట్టి అడగవద్దు.

పిల్లలు కూడా అరె ఆడుకుందామా స్కూల్ లేదు కదా అది లేదు కదా ఇది లేదు కదా అంటూ బ్యాట్ పట్టుకుని బాల్ పట్టుకుని రెడీ అవొద్దు. మీకు వచ్చే ఏడాది స్కూల్ కి వెళ్ళాలి రేపు కూడా క్రికెట్ ఆడుకోవాలి అనుకుంటే ఎవరూ బయటకు రావొద్దు. చాక్లెట్ లేదు బొమ్మ లేదు, స్నాక్ లేదు. పెడితే తినండి. మనం బయటకు వస్తే అది మనను వదిలే అవకాశం లేదు. పేరు గుర్తుంది కదా కరోనా. భర్తల మీద కోపం వచ్చి భార్యలు, భార్యల మీద కోపం వచ్చి భర్తలు, అమ్మల మీద కోపం వచ్చి పిల్లలు, అత్తగారి మీద కోపం వచ్చి కోడళ్ళు ఎవరూ బయటకు రావొద్దు. అలిగితే బాత్ రూమ్ లో తలుపు వేసుకుని కూర్చుని ఒక గంట ఏడవండి గాని బయటకు రావొద్దు.