మనిషి మెదడు చదివే హెల్మెట్.. అమెరికా కంపెనీ ఘనత.

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. అరక్షణానికో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తుంది. మనిషి సాధించలేనిది ఏదీ లేదని అనిపించేట్టుగా అసాధ్యాలు కూడా సుసాధ్యం అయ్యేలా రకరకాల పరికరాలు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా వార్తల్లోకి వచ్చిన మెదడుని చదివే హెల్మెట్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అమెరికాకి చెందిన కెర్నెల్ సంస్థ ఈ హెల్మెట్లని తీసుకువచ్చింది. 50వేల డాలర్లు విలువ చేసే ఈ హెల్మెట్లు మనిషి మెదడుని చదువుతాయట.

మనిషి ఆలోచనలు, ఏ పరిస్థితులకి ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయాలతో పాటు రక్త ప్రవాహం, ఆలోచనల వేగం, బయట పరిస్థితులకు శరీర అవయవాలు స్పందించే తీరుని ఇవి పసిగడతాయట. ప్రస్తుతానికి డజన్ల మందికి ఈ హెల్మెట్లు పంపబడ్డాయి. అక్కడ సక్సెస్ అయితే గనక మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ హెల్మెట్లలో మెదడులో కలిగే ఆలోచనలను అంచనా వేయగలిగే పరికరాలు, సెన్సార్లు ఉంటాయి. ఈ హెల్మెట్ బరువు సుమారు 2పౌండ్లు ఉంటుందని సమాచారం.

ఈ హెల్మెట్ ని ఎవ్వరైనా ధరించవచ్చు. ధరించి ఎక్కడైకైనా వెళ్లవచ్చు. దీని ద్వారా మానసిక రుగ్మతలను దూరం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. మానసికంగా ఇబ్బంది పడే వారిలో కలిగే ఆలోచనలని పసిగట్టి, దానికి తగినట్టుగా వైద్యం అందించవచ్చని చెబుతున్నారు. ఈ హెల్మట్లని తయారు చేయడానికి 5సంవత్సరాలు పట్టిందని, సుమారు 110మిలియన్ డాలర్ల ఖర్చు అయ్యిందని సంస్థ అధినేత అయిన కెర్నెల్ బ్రాన్ జాన్సన్ వెలిబుచ్చాడు. మొత్తానికి మనిషి ఆలోచనలు కూడా చదవగలడం అంటే సాంకేతికతలో పురోగామి సాధించినట్టే. ఐతే ఈ పురోగామి మంచికి మాత్రమే ఉపయోగపడితే మంచిది.