వాట్సాప్, జియో.. నిత్యావ‌స‌రాల ఆన్‌లైన్ డెలివ‌రీ.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌కు దెబ్బే..!

-

దేశంలోని ప్ర‌ముఖ టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో.. ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న విష‌యం విదితమే. ఫేస్‌బుక్‌.. జియోలో 9.99 శాతం వాటాను రూ.43,574 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అయితే క‌థ ఇక్క‌డితో ముగియ‌లేదు. ఇక‌పై వాట్సాప్ స‌హాయంతో జియోమార్ట్ ఈ-కామ‌ర్స్ సేవ‌ల‌ను పెద్ద ఎత్తున ప్రారంభించనుంది. దీంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గులుతుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

jio mart and whatsapp to deliver groceries through online

రిల‌య‌న్స్ జియో.. త‌న జియోమార్ట్ సేవ‌ల‌ను ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో పైల‌ట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. మ‌హారాష్ట్రలోని న‌వీ ముంబై, థానె, క‌ల్యాణ్ ప్రాంతాల్లో స్థానిక చిల్ల‌ర వ్యాపారుల భాగ‌స్వామ్యంతో జియోమార్ట్ ఈ సేవ‌ల‌ను అందిస్తోంది. అయితే జియో సంస్థ తాజాగా ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న డీల్ పుణ్య‌మా అని.. ఇక‌పై జియోమార్ట్ సేవ‌ల‌కు వాట్సాప్‌ను ఉప‌యోగించ‌నున్నారు. దీంతో దేశంలో జియోమార్ట్ సేవ‌లు ఇక పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి.

ప్ర‌స్తుతం భారత్‌లో వాట్సాప్‌కు 400 మిలియ‌న్ల మందికి పైగా యూజ‌ర్లు ఉన్నారు. ఈ క్ర‌మంలో వారు త‌మ స్థానిక ప్రాంతాల్లోనే జియోమార్ట్ ద్వారా త‌మ‌కు కావ‌ల్సిన కిరాణా స‌రుకుల‌ను కొనుగోలు చేయ‌వచ్చు. వాట్సాప్‌లో జియోమార్ట్ ద్వారా స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేస్తే.. వినియోగ‌దారుల‌కు స‌మీపంలో ఉన్న వ‌ర్త‌కులే ఆ స‌రుకుల‌ను ఇళ్ల వ‌ద్ద‌కు డెలివ‌రీ చేస్తారు. ఇక పేమెంట్‌ను ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేయ‌వ‌చ్చు. ఇందుకు గాను వాట్సాప్ ఇప్ప‌టికే బీటా ద‌శ‌లో ఉన్న వాట్సాప్ పేమెంట్స్ సేవ‌ల‌ను త్వ‌ర‌లో భార‌త్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది.

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆన్‌లైన్‌లో నిత్యావ‌స‌రాల‌ను డెలివ‌రీ చేసే సౌల‌భ్యం ఉన్న‌ప్ప‌టికీ త‌గినంత మ్యాన్ ప‌వ‌ర్ లేక అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థ‌లు త‌మ‌కు నిత్యం వ‌స్తున్న లెక్క‌కు మించిన‌ ఆర్డ‌ర్ల‌ను ప్రాసెస్ చేయ‌లేక‌పోతున్నాయి. ఇక బిగ్‌బాస్కెట్‌, గ్రోఫ‌ర్స్ వంటి కొన్ని సంస్థ‌లు స్థానిక వ్యాపారుల‌తో ఒప్పందాలు చేసుకుని క‌స్ట‌మ‌ర్లు ఆన్‌లైన్ చేసిన ఆర్డ‌ర్ల‌కు వారి ద్వారా స‌రుకుల‌ను డెలివ‌రీ అందిస్తున్నాయి. అయితే ఈ ప్రాసెస్ అంతా లేకుండానే నేరుగా క‌స్ట‌మ‌ర్ స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేశాక కొన్ని గంట‌ల్లోనే ఆ స‌రుకులు అత‌ని ఇంటికి డెలివ‌రీ అయ్యేలా జియో.. త‌న జియోమార్ట్ సేవ‌ల‌ను అందించ‌నుంది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే దేశ‌మంత‌టా జియో మార్ట్ సేవ‌ల‌ను జియో విస్త‌రించ‌నుంది. ఇక ఇందుకు వాట్సాప్ ప్లాట్‌ఫాం దోహ‌ద‌ప‌డ‌నుంది. ఏది ఏమైనా.. నిత్యావ‌స‌రాల ఆన్‌లైన్‌ డెలివ‌రీలో జియోమార్ట్ నుంచి ఇత‌ర కంపెనీల‌కు రానున్న రోజుల్లో గ‌ట్టి పోటీ ఎదురుకావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మరి ఆయా కంపెనీలు ఆ పోటీని ఎలా త‌ట్టుకుంటాయో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news