మీకు 18 ఏళ్లు నిండాయా?… టీకా కోసం ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకోండి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దీంతో కరోనా కట్టడిలో భాగంగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి.

అయితే 18 నుంచి 44 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తులు వ్యాక్సిన్‌ పొందాలనుకుంటే కొవిన్ ( CoWIN) వెబ్‌పోర్ట‌ల్‌ లేదా ఆరోగ్యసేతులో త‌ప్ప‌నిసరిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని కేంద్రం సూచించింది. ఏప్రిల్ 28 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. 18 నుంచి 44 ఏళ్ళ వయసు గల వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉండడంతో నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ రిజిస్ట్రేషన్ కోసం ముందుగా కొవిన్ పోర్ట‌ల్ (cowin.gov.in) ఓపెన్ చేయాలి. అనంత‌రం మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి ఓటీపీ పొందాలి. ఓటీపీని వెరిఫై చేసిన అనంతరం రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్‌ వ్యాక్సినేష‌న్ అని పేజి ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేష‌న్ లో భాగంగా ఫొటో ఐడెంటిటీ కార్డును ఎంచుకొని, ఐడెంటిటీ కార్డు నంబ‌ర్‌తో పాటు పేరు, పుట్టిన సంవ‌త్స‌రం వంటి వివ‌రాల‌ను న‌మోదు చేసి రిజిస్ట‌ర్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేష‌న్ అనంత‌రం ఏ రోజు టీకా వేయించుకోవాలో మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం రిజిస్ట్రేష‌న్ అనంత‌రం కనిపించిన షెడ్యూల్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంట‌ర్ చేయ‌గానే.. ఆ ప్రాంతంలో గల టీకా కేంద్రాల జాబితా క‌నిపిస్తుంది. అందులో మనకు అందుబాటులో ఉన్న టీకా కేంద్రంతో పాటు డేట్ మరియు టైంని ఎంచుకొని క‌న్ఫార్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. అయితే ఒకే లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంది. అలాగే షెడ్యూల్ తేదీల‌ను కూడా మార్చుకునే అవకాశం ఉంది.