ఇకపై ఓఆర్ఆర్ మీద ప్రయాణించే వాహనదారులు ఎప్పుడైనా సరే.. టోల్ గేట్ వద్ద 20 కన్నా ఎక్కువ వాహనాలు లైన్లలో వేచి ఉంటే.. టోల్ చెల్లించాల్సిన పని లేకుండా నేరుగా వెళ్లిపోయేలా కొత్త నిబంధనను అమలు చేయనున్నారు.
హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రయాణించే వాహనదారులకు శుభవార్త. ఇకపై గంటల తరబడి టోల్ గేట్ వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేదు. వాహనాలు ఎక్కువగా ఉంటే టోల్ కట్టకుండానే వెళ్లిపోయేలా కొత్త నిబంధనను త్వరలో అమలు చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిబంధనను అమలులోకి తెస్తున్నామని హెచ్ఎండీఏ వెల్లడించింది.
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై ఓఆర్ఆర్ మీద ప్రయాణించే వాహనదారులు ఎప్పుడైనా సరే.. టోల్ గేట్ వద్ద 20 కన్నా ఎక్కువ వాహనాలు లైన్లలో వేచి ఉంటే.. టోల్ చెల్లించాల్సిన పని లేకుండా నేరుగా వెళ్లిపోయేలా కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని హెచ్ఎండీఏ తెలిపింది. దీని వల్ల ఓఆర్ఆర్‌పై వాహనదారులు టోల్ గేట్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే టోల్ చెల్లించకుండానే వెళ్లవచ్చు. అందుకు ఎవరూ అడ్డుకోరు. ఈ మేరకు కొత్త నిబంధనను అమలు చేయాలని టోల్ గేట్ కాంట్రాక్టు సంస్థకు హెచ్ఎండీఏ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
సాధారణ సమయాల్లో ఓఆర్ఆర్‌పై టోల్ గేట్ల వద్ద ఎక్కువ రద్దీ ఉండదు. కానీ పండగలు, సెలవు దినాలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరుతుంటాయి. దీంతో టోల్ చెల్లించేందుకు వాహనదారులు గంటల తరబడి లైన్లలో వేచి చూడక తప్పడం లేదు. దీని వల్ల ఎంతో విలువైన సమయం వృథా అవుతోంది. మరోవైపు టోల్ గేట్ల వద్ద వేచి ఉండకుండా, ఆటోమేటిక్ విధానంలో పేమెంట్ చేస్తూ, వాహనదారులు వేగంగా వెళ్లిపోయేందుకు అనువుగా ఉండేలా.. అందుబాటులోకి తెచ్చిన ఫాస్ట్ ట్యాగ్‌ల వినియోగం ఇంకా పెరగలేదు. దీంతో టోల్‌గేట్ల వద్దీ ఆయా ముఖ్యమైన రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటూ.. వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అలాగే పండగల సీజన్‌లో టోల్‌గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు టోల్ చార్జిని వసూలు చేయరాదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలం అయ్యారు. దీంతో ఇవన్నీ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని హెచ్ఎండీఏ తాజాగా పైన చెప్పిన నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పండుగలు తదితర ముఖ్య రోజుల్లో టోల్ గేట్ల వద్ద రద్దీ ఉండదు. వాహనదారులు నేరుగా టోల్ గేట్ల ద్వారా టోల్ చెల్లించకుండానే వేగంగా వెళ్లిపోవచ్చు. ఈ క్రమంలో ప్రయాణికులకు గంటల తరబడి టోల్ గేట్ల వద్ద వేచి ఉండే బాధ తప్పనుంది..!