కరోనా లాక్డౌన్ వల్ల ప్రస్తుతం దేశంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. కానీ అంతకు ముందు ఏటా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య 6.7 శాతం పెరుగుతోంది. ఇక 2022 వరకు దేశంలో 105 మిలియన్ల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు ఉంటారని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే కొత్తగా జాబ్‌లలో చేరేవారు అయినా, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే.. ఉద్యోగులకు ఉండే 5 రకాల హక్కుల గురించి వారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేమిటంటే…
1. ఎంప్లాయ్మెంట్ బాండ్ లేదా కాంట్రాక్ట్
కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారు కంపెనీలతో బాండ్ లేదా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఇలాంటి సమయంలో ఆయా పత్రాలను ఉద్యోగులు తప్పనిసరిగా చదివి, ఆ తరువాతే ఉద్యోగం కావాలనుకుంటే సంతకం చేయాలి. లేదంటే తరువాతి కాలంలో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగంలో చేరేటప్పుడు తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలి. అయితే బాండ్ పీరియడ్ ద్వారా ఉద్యోగంలో చేరాల్సి వస్తే.. కంపెనీలు ఉద్యోగులను బలవంతపెట్టకూడదు. అది వారి ఇష్టపూర్వకంగా జరగాలి. కంపెనీలు ఒత్తిడి చేస్తే అలాంటి వాటిపై చర్యలు తీసుకునేందుకు కోర్టులను ఆశ్రయించవచ్చు.
2. నోటీస్ పీరియడ్
ఉద్యోగులు రాజీనామా చేయాల్సి వస్తే కంపెనీలు కనీసం 2 వారాల నుంచి 3 నెలల వరకు నోటీస్ పీరియడ్‌గా పరిగణించాలి. ఆ సమయంలో ఉద్యోగులు కొత్త జాబ్ వెదుక్కునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నపళంగా జాబ్ పోకుండా సెక్యూరిటీ ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక జాబ్ తీసేయాల్సి వస్తే కంపెనీలు ఉద్యోగులకు కచ్చితంగా పరిహారం చెల్లించాలి. దాని గురించి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ పొందే సమయంలోనే ఉద్యోగులు కంపెనీలతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది.
3. కంపెనీలు మారడం
ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీలో కన్నా ఇతర కంపెనీల్లో ఎక్కువ జీతం వస్తుందనే ఆశతో అకస్మాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేయరాదు. ఎందుకంటే.. ఒకవేళ బాండ్ అగ్రిమెంట్ ఉంటే.. కంపెనీలు అలాంటి ఉద్యోగులపై కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్ సమయంలో ఇలాంటి లొసుగులు లేకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. అయితే.. ఏ ఉద్యోగి అయినా సరే.. బాండ్ అగ్రిమెంట్ మీద పనిచేస్తుంటే.. ఆ గడువు ముగియకపోయినా సరే.. తనకు నచ్చిన కంపెనీలోకి మారేందుకు అవకాశం ఉంటుంది. కానీ ముందు తెలిపిన షరతులు వర్తిస్తాయి. అగ్రిమెంట్ సమయంలోనే దీనిపై కంపెనీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే.. తరువాతి కాలంలో కంపెనీ మారాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
4. సోషల్ సెక్యూరిటీ
ప్రతి కంపెనీ తన ఉద్యోగులకు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. అలాగే వారి నెలవారీ జీతం లోంచి 12 శాతాన్ని పీఎఫ్ కింద జమచేయాలి. అదేవిధంగా ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. క్యాంప్ ఆఫ్లకు పరిహారం ఇవ్వాలి. లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌజ్ రెంట్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ రీయెంబర్స్‌మెంట్, బోనస్ తదితర సౌకర్యాలన్నింటినీ ఉద్యోగులకు కంపెనీలు ఇవ్వాలి. వీటిని ఉద్యోగులు తమ హక్కుగా పొందాలి.
5. లైంగిక వేధింపులు
10 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉండే కంపెనీలు తమ ఉద్యోగులకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి. అందుకు గాను ఇంటర్నల్ కంప్లయెన్స్ కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేయాలి. అందులో ప్రిసైడింగ్ ఆఫీసర్, ఉద్యోగులు, ఎన్జీవోలు మెంబర్లుగా ఉంటారు. ఈ క్రమంలో ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఈ కమిటీ వారికి రక్షణ కల్పించాలి. అలాగే ఒకవేళ ఎవరైనా ఇబ్బందులకు గురైతే వెంటనే కమిటీ కల్పించుకుని వారికి కావల్సిన సహాయం అందించాలి.