టెన్త్ లేదా ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలు.. విద్యార్థుల్లో అలజడి మొదలవుతుంది. అన్నీ సరిగ్గా చదివినా, చదవకపోయినా సరే… పరీక్షలంటే ఎవరికైనా కాసింత భయం ఉంటుంది. అయితే ఇతర సబ్జెక్టులు విషయం ఏమోగానీ గణితం అంటే చాలా మంది విద్యార్థులు భయపడుతారు. లెక్కల సబ్జెక్టులో క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారో, మార్కులు ఎన్ని వస్తాయోనన్న కంగారు వారిలో ఉంటుంది. అయితే పలువురు విద్యానిపుణులు మాత్రం మ్యాథ్స్ అంటే భయపడవద్దని, అది చాలా ఈజీ అని, పలు సూచనలు పాటిస్తే మ్యాథ్స్‌లో విజయం సాధించడం పెద్ద విషయం ఏమీ కాదని వారు చెబుతున్నారు. మరి వారు విద్యార్థులకు అందిస్తున్న సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కొందరు విద్యార్థులు గణితంలో పలు ఫార్మూలాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా వాటిని బట్టీ పడతారు. అలా చేయకూడదు. ఆ ఫార్మూలాలు ఎలా వస్తాయో తెలుసుకుంటే వాటిని సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు. అంతేకానీ ఫార్ములాలను గుడ్డిగా బట్టీ పట్టకూడదు. ఎందుకంటే అర్థం చేసుకోకుండా బట్టీ పడితే సమయానికి అవి గుర్తుకు రాకపోవచ్చు. దీంతో ఆందోళన మొదలవుతుంది. కనుక మ్యాథ్స్‌లో ఏ ఫార్ములాను అయినా అది ఏవిధంగా వస్తుందో తెలుసుకుంటే.. ఆ ఫార్ములాను గుర్తు పెట్టుకోవడం చాలా సులభతరమవుతుంది.
2. ప్రతి సమస్యను సాల్వ్ చేసేముందు దానికి ఎలాంటి ఫార్ములా వాడాలో ముందుగా తెలుసుకోవాలి. అందుకు గాను ఫార్ములాలకు చెందిన నిబంధనలను గుర్తించాలి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే.. ఏ సమస్యకు ఏ ఫార్ములా అయితే సరిపోతుందో ఒక అంచనాకు త్వరగా రావచ్చు. దీంతో ప్రశ్నలను త్వరగా రాసేందుకు అవకాశం ఉంటుంది.
3. ఒక ప్రశ్నను భిన్నమైన ఫార్ములాలు వాడి సాల్వ్ చేసేందుకు యత్నించాలి. ఎందుకంటే కొన్ని సార్లు ఒకే ప్రశ్నను మార్చి మార్చి ఇస్తారు. దీంతో విద్యార్థులు కన్‌ఫ్యూజ్ అవుతారు. అలా కాకుండా ఉండాలంటే.. ఒక్కో సమస్యను పరిష్కరించేందుకు భిన్నమైన ఫార్ములాలను వాడాలి. దీని వల్ల ఏయే సమస్యలకు ఏయే ఫార్ములాలు అవసరం అవుతాయో ఇట్టే తెలిసిపోతుంది.
4. గణితంలో ఉండే పై (Π) సింబల్ తోపాటు పలు నంబర్లకు స్క్వేర్లు, స్క్వేర్ రూట్లు తదితర వాల్యూస్‌తో కూడిన ఓ టేబుల్‌ను రూపొందించుకోవాలి. దీని వల్ల సమయం చాలా ఆదా అవుతుంది. ఆయా లెక్కలను సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూస్ త్వరగా గుర్తుకు వస్తాయి.
5. ఫార్ములాలు, ఇతర విషయాలపై కచ్చితమైన అవగాహన ఉంది అనుకుంటే మాక్ టెస్ట్ పేపర్లు ఆన్సర్ చేయండి. గతేడాది క్వశ్చన్ పేపర్లను సాల్వ్ చేయండి. దీంతో పరీక్షలకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామ్ హాల్‌లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
6. ప్రతి మాక్ టెస్ట్ లేదా క్వశ్చన్ పేపర్‌ను ఎగ్జామ్ తరహాలో రాయండి. ఎగ్జామ్‌లో అయితే నిర్దిష్టమైన సమయం ఇస్తారు కదా. అదే సమయంలోగా మాక్ టెస్ట్ లేదా క్వశ్చన్ పేపర్లను రాయండి. దీంతో ఎగ్జామ్‌కు బాగా ప్రిపేర్ కావచ్చు. హాల్‌లో టైముకు క్వశ్చన్ పేపర్ పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే.. చివరి నిమిషం అయినా ప్రశ్నలు రాస్తూనే ఉండాల్సి వస్తుంది. దీంతో ఆందోళనకు గురవుతారు. అలా కాకుండా ఉండాలంటే మాక్ టెస్ట్‌లకు కూడా టైం పెట్టుకుని రాయాలి. ఇది నిర్దిష్టమైన టైంలోగా ఎగ్జామ్‌ను పూర్తి చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.